Johnson Elected US House Speaker : అమెరికా ప్రతినిధుల సభ స్పీకరుగా మైక్ జాన్సన్ మరోసారి ఎన్నికయ్యారు. అగ్ర రాజ్యానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్ జాన్సన్కు పూర్తి మద్దతిచ్చారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ జాన్సన్కు అనుకూలంగా 218 ఓట్లు పోలయ్యాయి. వ్యతిరేకంగా 215 ఓట్లు పడ్డాయి. దాదాపు రెండు గంటల పాటు ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు సైతం ఆయనకే మద్దతుగా ఓటు వేశారు. అయితే తాను వారికి ఎలాంటి మందస్తు హామీలు ఇవ్వలేదని మైక్ తెలిపారు. 'ఇది నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. మన దేశ చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ సమయం' అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత స్పీకర్‌గా మైక్ జాన్సన్ ప్రమాణస్వీకారం చేశారు.