Case On Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశారు. ఆయన వ్యాఖ్యల వల్ల ఐదు లీటర్ల పాలు కిందపడిపోయాయని, దీంతో తనకు రూ.250 నష్టం వాటిల్లిందని స్థానిక కోర్టును ఆశ్రయించారు. వివిధ సెక్షన్ల కింద రాహుల్‌పై విచారణ కోరుతూ ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే?
జనవరి 15న దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఆ సమయంలో రాహుల్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయని ఆరోపించారు. తాము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తోపాటు భారత రాజ్యంతో పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు. అప్పుడు రాహుల్ వ్యాఖ్యలను విన్న తాను షాక్‌కు గురయ్యాయని ఫిర్యాదుదారుడు ముకేశ్ చౌధరీ తెలిపారు.
దీంతో తన చేతిలో ఉన్న ఐదు లీటర్లు పాలు (లీటర్ ధర రూ.50) కింద పడిపోయాయని సోనుపుర్ గ్రామ నివాసి ముకేశ్ చెప్పారు. ఆయన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు రాహుల్ వల్ల తనకు రూ.250 నష్టం వాటిల్లిందని రోసెరా సబ్ డివిజన్‌లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు అంగీకరించిందో లేదో తెలియదు.
అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం చెలరేగింది. అసోంకు చెందిన మోంజిత్ చెటియా ఆయనపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుప్రీంలో ఊరట
మరోవైపు, ఇటీవల రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువునష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో ఝార్ఖండ్‌లోని ట్రయల్ కోర్టు విచారణపై ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది.
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గౌరవానికి భంగం కలిగించేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత నవీన్ ఝా ఫిర్యాదు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణను రద్దు చేయాలంటూ ఝార్ఖండ్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయనకు ఊరట లభించింది.