Teenage Sleep Importance for Mental Health : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. తినే తిండి, తాగే నీరు ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. కానీ.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రను పట్టించుకోవట్లేదు. టీనేజర్లు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. స్మార్ట్ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్లోపడి సమయానికి నిద్రపోవట్లేదు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
"యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్" 2020లో నిద్రకు సంబంధించి ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. 15 సంవత్సరాల నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిని పరిశోధకులు టెస్ట్ చేశారు. 15 సంవత్సరాల వయసులో నిద్రలేమిని అనుభవించిన వారు.. 21 లేదా 24 సంవత్సరాలు వచ్చే నాటికి ఇతరుల కంటే తీవ్రమైన ఆందోళన, ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని తేల్చారు.
అయితే.. నిద్రలేమి టీనేజర్లలో మాత్రమే కాదు.. పెద్దలలో కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని కనుగొన్నారు. మూడు నెలల నుంచి 34 సంవత్సరాల వయసులో ఉన్న మొత్తం 1,50,000 మందిపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో చాలా మంది నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పారని.. వీరంతా భవిష్యత్తులో డిప్రెషన్‌తో బాధపడే అవకాశం రెండింతలు ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.
నిద్రలేమి ప్రభావాలు..తగినంత నిద్ర లేకపోతే అది చూపే ప్రభావం మామూలుగా ఉండదు. నైట్ సరిగా నిద్రపోకపోతే తర్వాతి రోజూ మనల్ని డిమోటివేట్ చేసి చిరాకు తెప్పిస్తుంది. ఇది అనివార్యంగా మన వ్యక్తిగత, రోజూవారీ పనులపై ప్రభావం చూపుతుంది. బుద్ధి మాంద్యం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే నిద్రలేమి సమస్య.. బాడీలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమవుతుంది. ఇవేకాదు.. నిద్రలేమి దీర్ఘకాలంగా కొనసాగితే అధికరక్తపోటు, మధుమేహం, ఊబకాయం ముప్పు దాడిచేసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.