Reason for Hungry After Eating: మనలో చాలా మంది తిన్న వెంటనే మళ్లీ ఆకలి అవుతుందని అంటుంటారు. దీంతో తిన్న కాసేపటి తర్వాత మళ్లీ మళ్లీ తింటుంటారు. అయితే, ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పరిస్థితి రావడానికి గల కారణాలేంటి? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొటీన్ తగినంత తీసుకోకపోవడం: మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ మొత్తంలో ప్రొటీన్, తక్కువ మొత్తంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకగాన్ వంటి హార్మోన్స్ విడుదలకు ప్రొటీన్ కారణం అవుతుందని అంటున్నారు. అయితే, ఈ హార్మోన్ తగినంత విడుదల అవుతేనే కడుపు నిండినట్లుగా అనిపించి ఆకలి భావనను తగ్గిస్తుందని వివరిస్తున్నారు. అది తగినంత పరిమాణంలో శరీరానికి లభించకపోతే.. ఎంత తిన్నా మళ్లీ తినాలనే భావన కలిగిస్తుందని నిపుణులు తెలిపారు. కాబట్టి, మీరు తినే ఆహారంలో ప్రొటీన్ తగినంత ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఫైబర్ తక్కువగా తీసుకోవడం: ఇంకా మీరు అతి ఆకలితో ఇబ్బందిపడడానికి పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం కూడా మరొక కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే అది జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని.. దాంతో చాలాసేపు కడుపు నిండిన భావన కలుగుతుందని అంటున్నారు. తగినంత ఫైబర్ శరీరానికి అందకపోతే ఆకలి అనిపిస్తుందని వివరిస్తున్నారు. అందుకే తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
కడుపు నిండా తినకపోవడం: ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్ పేరుతో తక్కువ మోతాదులో ఆహారం తింటున్నారు. అయితే, శరీరంలో స్ట్రెచ్ రెసెప్టార్స్ ఉంటాయని.. ఇవి మీరు తీసుకున్న ఆహారం పరిమాణం బట్టే కడుపు నిండిందా లేదా అన్న అంచనాకి వస్తాయని అంటున్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోతే మెదడుకి ఆకలి సంకేతాలను పంపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కడుపు నిండా తినాలని.. కాకపోతే కెలోరీలు తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.
హార్మోన్ల అసమతుల్యత: మన శరీరంలో ఉండే వివిధ రకాల హార్మోన్లలో లెప్టిన్ అనేది ఒకటి. ఇది కడుపు నిండిందన్న సంకేతాన్ని బ్రెయిన్‌కు చేరవేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ సరిగా విడుదల కాకపోతే.. ఎంత తిన్నా మళ్లీ తినాలనిపిస్తుందని అంటున్నారు. అందుకే హార్మోన్ల అసమతుల్యత ఉందేమో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ కారణంగా బరువు కూడా అదుపులో ఉండదని హెచ్చరిస్తున్నారు. 2019లో Journal of Clinical Endocrinology and Metabolismలో ప్రచురితమైన "The Role of Hormones in Hunger and Satiety" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)