Diabetes Best Fruits to Eat:పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. కానీ, మధుమేహంతో బాధపడే వారు మాత్రం పండ్లు తినాలంటే కాస్త వెనకడుగు వేస్తుంటారు. పండ్లలో చక్కెరస్థాయి ఎక్కువ ఉంటుందని.. వాటిని తింటే షుగర్ పెరుగుతుందని భయపడుతుంటారు. అయితే, పండ్లలో చక్కెర స్థాయులు ఉంటుందనేది వాస్తవమే అయినా.. అన్ని పండ్లు ఆరోగ్యానికి హానికరం కావని నిపుణులు అంటున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను మధుమేహం ఉన్నవారు కూడా ఎలాంటి భయం లేకుండా తినొచ్చని చెబుతున్నారు. 2002లో Journal of the American Dietetic Associationలో ప్రచురితమైన "Glycemic Index of Fruits and Vegetables" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఈ నేపథ్యంలోనే ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే?
మనం తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయని నిపుణులు అంటున్నారు. ఇలా రక్తంలో చక్కెర స్థాయి ఎంతమేర పెరుగుతుందో తెలిపే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అని పిలుస్తుంటారు. తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 55కు మించకుండా ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అని, 56-69 మధ్య ఉంటే మధ్యస్థ, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌గా చెబుతుంటారు. అయితే, మధుమేహం ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తక్కువగా తింటే మంచిదని సలహా ఇస్తున్నారు.
దానిమ్మ:దానిమ్మ పండ్లలో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ చక్కెరస్థాయి చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 18 మాత్రమేనని అంటున్నారు. కాబట్టి దానిమ్మ పండ్లను మధుమేహులు ఎలాంటి ఆలోచన లేకుండా తినొచ్చని సూచిస్తున్నారు. వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ యాక్సిడెంట్లు కణాలను నాశనం చేసే ప్రమాదకర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తాయని వివరిస్తున్నారు. ఇంకా రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంతోపాటు కొవ్వు స్థాయిలను సైతం తగ్గిస్తాయని వెల్లడిస్తున్నారు. దానిమ్మలో పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయని.. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయని పేర్కొన్నారు.
యాపిల్స్:ప్రతి రోజు ఓ యాపిల్ తింటే వైద్యుల అవసరం రాదని నిపుణులు చెబుతుంటారు. ఇందులో విటమిన్ సి, పీచు, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా యాపిల్‌లో ఉండే పీచు, పాలీఫినోల్స్.. కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయని వివరిస్తున్నారు. ఫలితంగా ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిలువరిస్తాయని అంటున్నారు. యాపిల్‌లో చక్కెర ఉంటుందని.. అయితే, అది ఫ్రక్టోస్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫ్రక్టోస్ రక్తంలోని చక్కెర స్థాయిపై పెద్దగా ప్రభావం చూపదని తెలిపారు. యాపిల్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని.. దీంతో చక్కెరస్థాయి పెరగకుండా ఉంటుందని వెల్లడిస్తున్నారు. యాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ 36గా ఉంటుంది కాబట్టి.. మధుమేహంతో బాధపడుతున్న వారు వీటిని హాయిగా తినొచ్చని సూచిస్తున్నారు.
స్ట్రాబెర్రీ:స్ట్రాబెర్రీ గ్లైసెమిక్ ఇండెక్స్ 46గా ఉంటుందని.. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర చేరే ప్రక్రియ నిదానంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒకేసారి చక్కెర స్థాయి పెరగకుండా నిలువరిస్తుందని వివరిస్తున్నారు. అలాగే ఈ స్ట్రాబెర్రీలు రోగనిరోధకశక్తిని పెంచుతాయని తెలిపారు. ఇందులో ఎక్కువగా ఉండే పీచు జీవ్రక్రియను మెరుగుపర్చడంతోపాటు క్యాన్సర్‌తో పోరాడే శక్తినిస్తాయని వెల్లడిస్తున్నారు. బరువు తగ్గడంలోనూ ఈ పండ్లు సహాయపడతాయని అంటున్నారు.
జామకాయ:రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో జామకాయ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 12 మాత్రమే ఉంటుందని.. ఇంకా ఇందులో ఉండే పీచు చక్కెర శోషణను నియంత్రిస్తూ రక్తంలో చక్కెరస్థాయిని పెరగనివ్వదని వివరిస్తున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు పెద్ద సహాయం చేస్తాయని అంటున్నారు. వీటిలో సోడియం శాతం తక్కువగా, పోటాషియం శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.