When we Should Drink Water:నీరు తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నీరు తాగడం వల్ల బరువు తగ్గుతుందని Nutrients జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది. Drinking Water and Weight Loss: A Systematic Review అనే అంశంలో Bharati Vidyapeeth Deemed University అసోషియేట్ ప్రొఫెసర్ అశ్విణ్ జోషి పాల్గొన్నారు. ఇంకా మెదడు పనితీరు మెరుగుపడి ఉత్సాహంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇలా అనేక ప్రయోజనాలు కలిగిన నీటిని తాగడానికి మంచి సమయం ఏది?
మరి నీటిని ఎప్పుడు తాగాలి?
ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు నీరు తాగటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం లాంటి పోషకాలు సైతం లభిస్తాయన్నారు. ఫలితంగా రోజంతా హుషారుగా ఉండొచ్చని వివరించారు.
ఎటూ కాని సమయంలో ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తే ముందు కొన్ని నీళ్లు తాగటం మంచిదని చెబుతున్నారు. ఆకలి, దాహం రెండింటి ప్రేరేపకాలను మెదడు ఒకేలా గ్రహిస్తుందని.. కాబట్టే చాలాసార్లు ఆకలి, దాహం మధ్య తేడా తెలియదని వివరించారు. ఇలా నీళ్లు తాగిన కొద్ది నిమిషాల తర్వాత ఆకలి తగ్గితే దాహం వేసిందనే అర్థం చేసుకోవాలని తెలిపారు. ఫలితంగా అనసరంగా ఆహారం తీసుకోవడాన్ని అరికట్టొచ్చని అంటున్నారు.
ఇంకా విరేచనాలు, వాంతులు, జ్వరం మూలంగా శరీరంలో నుంచి చాలా నీరు బయటకు వెళ్లిపోతుంది. అయితే, వీటి లక్షణాలు ఆరంభమవుతున్న దశలోనే.. దాహం వేయకపోయినా కూడా తరచూ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జబ్బుల నుంచి త్వరగా కోలుకోవచ్చని అంటున్నారు. ఇంకా సాయంత్రం వేళల్లో నిరుత్సాహంగా అనిపించినప్పుడు చాలామంది కాఫీ, టీ తాగుతుంటారు. కానీ ఇలా కాకుండా ముందుగా ఓ గ్లాసు నీరు తాగటం మేలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తూ మూడ్ మెరుగవుతుందని అంటున్నారు.
తలనొప్పిగా అనిపించినప్పుడూ నీళ్లు తాగడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కూడా తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవటానికి.. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండటానికి, కీళ్లు తేలికగా కదలటానికి సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుందన్నారు. అందుకే శరీరంలో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయని వివరించారు. కాబట్టి కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లి అలసట ముంచుకొస్తుందని వివరించారు.