Chandipura Virus Symptoms : ప్రస్తుతం చిన్నపిల్లల్లో ఎక్కువగా సోకుతున్న "చాందీపురా వైరస్" పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో 10-15 ఏళ్ల లోపున్న చిన్నారుల్లో ఎక్కువగా ప్రబలుతోన్న ఈ వైరస్ కారణంగా పలు మరణాలూ సంభవిస్తున్నాయని చెబుతున్నారు. అసలేంటి.. చాందీపురా వైరస్? దీని ప్రభావం పిల్లలపైనే ఎక్కుగా ఎందుకు ఉంటోంది? ఇది ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలేంటి? చిన్నారులు దీని బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నచాందీపురా వైరస్(Chandipura Virus).. కొత్తదేమి కాదు. 1965లోనే మహారాష్ట్రలోని చాందీపురా అనే ప్రాంతంలో తొలిసారి ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే.. దీనికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. 2003-04 మధ్య కాలంలో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రబలిన ఈ వైరస్‌కు.. సుమారు 300 మంది చిన్నారులు బలైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రస్తుతం గుజరాత్లో ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అక్కడ పదుల సంఖ్యలో దీని బారిన పడుతున్నారు. కొందరు ఈ వైరస్ తీవత్రకు తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. అంతేకాదు.. ఇటీవలే గుజరాత్‌కు చెందిన ఓ నాలుగేళ్ల బాలిక చాందీపురా వైరస్‌తో చనిపోయినట్లు పుణేలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’.. పాప రక్త నమూనాల్ని పరీక్షించి నిర్ధరించింది.
ఎలా వ్యాపిస్తుందంటే?:ఇది 'రబ్డోవిరిడె’ అనే వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ 'శాండ్ ఫ్లై' అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపున్న పిల్లలు దీని బారిన పడే ముప్పు అధికమని చెబుతున్నారు. అందులోనూ ఇది పదేళ్ల లోపున్న పిల్లలకు సోకితే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
అదే ప్రధాన కారణమా?చాందీపురా వైరస్ తీవ్రత.. చిన్న పిల్లల్లోనే ఎక్కువగా ఉండడానికి కారణం వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడమేనట! పిల్లలు ఎదిగే క్రమంలో అప్పుడప్పుడే బలపడుతున్న రోగనిరోధక వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీసి వివిధ రకాల దుష్ప్రభావాల బారిన పడేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే, ఈ వైరస్ పెద్దల పైనా అరుదుగా ఎఫెక్ట్ చూపిస్తుందట. కాకపోతే పెద్దవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు, మరణాలు చాలా తక్కువగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు! :
- విపరీతమైన తలనొప్పి
- తీవ్రమైన జ్వరం
- ఫిట్స్
- వాంతులు
గందరగోళంగా, మగతగా అనిపించడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పై లక్షణాలతో పాటు సీరియస్ కేసుల్లో బాధితుడు కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంటుందంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ అందిస్తే వేగంగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.