Whooping Cough Symptoms :సాధారణంగా వాతావరణంలో కాస్త మార్పు వచ్చిందంటే చాలు.. చాలా మందిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చేస్తాయి. అలాగే.. కొందరిలో వెదర్ ఛేంజ్ మాత్రమే కాకుండా కాస్త చల్లని ఆహారం తీసుకున్నా, చల్లని గాలి తగిలినా బాడీలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఇంకొందరిలో తాగే నీటిలో మార్పులు వచ్చినా దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎటాక్ చేస్తుంటాయి.
అయితే.. కొన్నిసార్లు విపరీతమైన పొడిదగ్గు వేధిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని సాధారణ జలుబు లక్షణంగా భావించి అదే తగ్గుతుందని లైట్ తీసుకుంటారు. కానీ, అది 100 రోజుల దగ్గు(Cough)కూడా అయి ఉండొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని నిర్లక్ష్యంగా తీసుకుంటే ప్రాణాల మీదికి రావొచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే ఇంతకీ 100 రోజుల దగ్గు అంటే ఏమిటి? ఇది రావడానికి కారణాలేంటి? చికిత్స ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కోరింత దగ్గు రావడానికి కారణమేమిటి?
100 రోజుల దగ్గునే.. కోరింత దగ్గు, పెర్టుసిస్ అని కూడా అంటారు. ఇది అంటువ్యాధి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే శ్వాసకోశ వ్యవస్థను నాశనం చేస్తుంది. ప్రధానంగా చిన్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కోరింత దగ్గు లక్షణాలు అంత త్వరగా బయటపడవు. పెర్టుసిస్ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించాక మూడు వారాల వరకు దీని లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కోరింత దగ్గు ఇంక్యుబేషన్ పీరియడ్ 5-10 రోజులు ఉంటుందట.
కొన్ని ప్రారంభ లక్షణాలు :
- సాధారణ జలుబు
- తరుచుగా ముక్కు కారడం
- తేలికపాటి దగ్గు
- జ్వరం
- తుమ్ములు
- శరీర నొప్పులు
అయితే.. ఒక వారం లేదా రెండు వారాల్లో పరిస్థితి మొత్తం మారిపోతుంది. అది పొడి, నిరంతర దగ్గుగా మారుతుంది. ఆ సమయంలో ఊపిరి కూడా ఆడదు. ముఖ్యంగా ఒకవేళ పిల్లలకు కోరింత దగ్గు వస్తే ఆ సమయంలో తినడం, తాగడం లేదా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. అలాగే దగ్గు వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు పిల్లలు తరచుగా "హూప్" శబ్దం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దగ్గు తీవ్రంగా మారితే వాంతులు అవ్వడం, నోటి చుట్టూ నీలం లేదా ఊదా రంగులోకి చర్మం మారుతుంది. తీవ్రమైన డీహైడ్రేషన్, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.