Mother And Two Children Died : క్షణికావేశం తల్లితో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది. భర్తపై కోపంతో పిల్లలకు విషమిచ్చి, భార్య ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందగా, ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు. ముగ్గురు మృతితో జగిత్యాల జిల్లా మద్దులపల్లిలో విషాదం నెలకొంది.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, కంబాల హారిక ఇంట్లో కొన్ని వ్యక్తిగత కారణాలు, భర్త వేధింపుల వల్ల కుమారుడు కృష్ణాంత్ (10), 8 ఏళ్ల కుమార్తె మాయంత లక్ష్మికి ఈ నెల 13న సాయంత్రం విషపదార్థమిచ్చి తాను కూడా సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.
13న రాత్రి జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హారిక మృతి చెందింది. ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉండగా హైదరాబాద్కు తరలించారు. పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. తల్లి ఇద్దరు పిల్లల మృతికి భర్త తిరుపతే కారణమని హారిక పుట్టింటివారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒగ్గు కళాకారుడు అయిన తిరుపతికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని హారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
"మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక (30) వారి పిల్లలైన కృష్ణాంత్, మహంతి లక్ష్మి(8) ఇంట్లో కొన్ని కారణాలు, భర్త వేధింపుల వల్ల క్షణికావేశంలో విషపదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. వారి పిల్లలు కూడా సేవించినట్లు తెలిసింది. చికిత్స పొందుతూ కంబాల హారిక 13వ తేదీన మృతి చెందడం జరిగింది. 16వ తేదీన ఆమె ఇద్దరు పిల్లలు చికిత్స తీసుకునే క్రమంలోనే చనిపోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం." - రవి కిరణ్, పెగడపల్లి ఎస్ఐ
వివాహేతర సంబంధమే కారణమా? : 12 ఏళ్ల క్రితం తిరుపతికి హారికతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు పుట్టాక వరకట్నం కోసం వేధించడంతో పాటు మరో మహిళను ఇంటిదాకా తీసుకురావడంతోనే మనస్తాపం చెంది భర్తకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పుట్టింటివారు తెలిపారు. హారిక ఇద్దరు పిల్లల మృతికి కారణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చర్యలు ఉండాలని హారిక సోదరుడు, మరదలు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల అదుపులో మృతురాలి భర్త : భార్య, ఇద్దరు పిల్లల మృతితో ఇక తానెందుకు బతకాలని బోరున విలపించాడు భర్త తిరుపతి. హారిక పుట్టింటి వారు ఫిర్యాదు మేరకు పెగడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు వీడియో కాల్లో హారిక భర్త తిరుపతి తో మాట్లాడి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలపడంతో హారిక తిరుపతి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
బీమా చేయించి మరీ చంపేశాడు - మతిస్థిమితం లేని బావపై బావమరిది ఘాతుకం
తల్లి మృతదేహంతో ఇంట్లోనే 9 రోజులు గడిపిన కుమార్తెలు - ఇంతకీ ఏం జరిగింది?