Side Effects of Salt on Body:వంటల్లో ఉప్పు ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత గొప్ప వంటకమైనా.. అందులో సరిపడా ఉప్పు లేకపోతే దానిలోని రుచి బయటకు రాదు. కూరగాయలు, పండ్లు, మాంసాలు, తృణధాన్యాలు.. వీటన్నింటిలో ఎంతోకొంత ఉప్పు ఉంటుంది. కండరాలు సంకోచించడం, సడలించడంలో ఉప్పుఉపయోగపడుతుంది. నరాలు ఉత్తేజితమవడానికి ఇది దోహదం చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చేటు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా వాడడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వుక్కల రాజేశ్ చెప్పారు. ఆ ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక రక్తపోటు:శరీరంలో ఉప్పు శాతం పెరిగితే.. అది రక్తపోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి హైపర్‌టెన్షన్‌కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు.. గుండె జబ్బులకు(National Institute of Health రిపోర్ట్) కూడా కారణమవుతుందని చెప్పారు. తలనొప్పి, తల తిరగడం, వేగవంతమైన హృదయ స్పందన లాంటివి కనిపిస్తాయన్నారు.
శరీరంలో వాపు:ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు పేరుకుపోతుందని వైద్యులు వివరించారు. ఫలితంగా చేతులు, పాదాలు, ముఖం, కాళ్లలో వాపు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తరచూ మూత్రం :ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే కాకుండా మూత్రం ముదురు రంగులోకి మారి దాని పరిమాణం కూడా తగ్గుతుందన్నారు. ఫలితంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి.. ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని వివరించారు.
అలసట, బలహీనత:ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత, అలసట వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు చేసే పనిపైనా ఏకాగ్రత పెట్టలేమని తెలిపారు. ఫలితంగా శరీర సమతుల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.