Benefits of Parks and Green Spaces:మీరు పార్కులకు వెళ్తున్నారా? ఈ విషయం మీకు తెలుసా? సుమారు గంట పాటు పార్కులో సమయాన్ని గడపడం లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కేవలం మైండ్ రిఫ్రెష్ కావడమే కాకుండా శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడిని తగ్గిస్తుంది:పార్కుల్లో తిరగడం వల్ల ఒత్తిడి తగ్గి శరీరంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో వెల్లడైంది. ఒత్తిడిని పెంచె కార్టిసాల్ హర్మోన్ స్థాయులను పెరగకుండా చేస్తుందని హార్వర్డ్ ప్రొఫెసర్ Heather Eliassen చెబుతున్నారు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) స్వచ్ఛమైన గాలి, సహజ కాంతి, పార్కుల్లోని చెట్లు, మొక్కలు ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా మారుస్తుందని వివరించారు.
ఏకాగ్రతను పెంచుతుంది:పచ్చటి చెట్ల మధ్య సమయాన్ని గడపడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగి లక్ష్యంపైనే దృష్టి కేంద్రీకృతమవుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఆందోళనను తొలగించి మానసిక ప్రశాంతతను ఇచ్చి ఏకాగ్రతను పెంచేలా చేస్తుందని తెలిపారు. అందుకే ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు కొద్ది సేపు పార్కుల్లో తిరగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మెదడు షార్ప్‌గా పనిచేస్తూ అప్రమత్తంగా ఉంటామని వివరించారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:పార్కుల్లో సమయాన్ని గడపడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరాన్ని కాపాడే తెల్ల రక్త కణాలు పెరుగుతాయని వివరించారు. ఇంకా ఎండకు తిరగడం వల్ల శరీరానికి విటమిన్ డీ అంది రక్షణగా నిలుస్తుందని తెలిపారు.
ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది:మనం రోజు చేసే వాకింగ్, జాగింగ్ లాంటి వ్యాయామాలను పార్కుల్లో చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాలెన్సింగ్‌తో పాటు కండరాలు బలంగా మారతాయని వివరించారు. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
సుఖమైన, హాయి నిద్రను ఇస్తుంది:పార్కుల్లో సమయాన్ని గడపడం వల్ల రాత్రి హాయిగా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సూర్యుడి కిరణాలు పడేలా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఇంకా సూర్య కిరణాలు పడడం వల్ల మెలాటొనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరిగి రాత్రి పూట హాయిగా నిద్ర పడుతుందని వివరించారు.
ఒంటరితనాన్ని పొగొడుతుంది:పార్కుల్లో తిరగడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడి సోషల్ కనెక్షన్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. ఇది ముఖ్యంగా ఒంటరితనంతో బాధపడే వారిని బయటకు తీసుకువస్తుందని అంటున్నారు.