Pacemaker Lifespan Battery: ప్రస్తుతం గుండె సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే, సాంకేతికత అభివృద్ధి చెందిన తరుణంలో పేస్ మేకర్, స్టెంట్ లాంటి అనేక పరికరాలు రోగుల ప్రాణాలను కాపాడుతున్నాయి. మరి ఈ పేస్‌మేకర్ ఎంతకాలం పనిచేస్తుంది? దీని కాల పరిమితి దాటితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? స్టెంట్స్ సరిగా ఉన్నాయో లేదో అన్న విషయం ఎలా తెలుస్తుంది? ఇందుకోసం ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సి.శ్రీదేవి వీటికి సమాధానాలు ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె నెమ్మదిగా కొట్టుకుంటున్న సమయంలో పేస్‌మేకర్ ప్రచోదనాన్ని వెలువరించి, తిరిగి గుండె సరిగా కొట్టుకునేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పనిచేయటానికి అవసరమైన శక్తిని బ్యాటరీ అందిస్తుందని వివరిస్తున్నారు. అయితే, ఈ బ్యాటరీ ఎంతకాలం పనిచేస్తుందనేది కంపెనీ రకం, వాడకం బట్టి ఆధారపడి ఉంటుందని వెల్లడిస్తున్నారు. సుమారుగా 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఈ పేస్ మేకర్ పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, సాధారణంగా ప్రతి ఆరు నెలలకోసారి పేస్‌మేకర్‌ను పరీక్షించుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అప్పుడే అది ఎలా పనిచేస్తోంది? బ్యాటరీ ఇంకా ఎంతవరకూ రావొచ్చు? తీగలు సక్రమంగా ఉన్నాయా, లేవా? అనేవి ఎప్పటికప్పుడు తెలుస్తాయని సలహా ఇస్తున్నారు.
ఒకవేళ బ్యాటరీ ఖాలీ అయ్యే సమయానికి ముందుగా కొన్ని సంకేతాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి పేస్‌మేకర్‌ను అమర్చటానికి ముందుగా ఉన్న కళ్లు తిరిగి పడిపోవటం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు. ఇంకా ఒకవేళ మీకు అనుమానం ఉన్నట్టయితే వెంటనే గుండెలయను పరీక్షించే ఎలక్ట్రోఫిజియాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. వారు పేస్‌మేకర్‌ను తనిఖీ చేసి తగు సూలహాలు ఇస్తారని అంటున్నారు. అవసరమైతే బ్యాటరీని మారుస్తారని వెల్లడిస్తున్నారు.
ఇక స్టెంట్స్ విషయానికి వస్తే.. అవి సరిగా ఉన్నాయో లేవో తెలుసుకోవటానికి సీటీ యాంజియోగ్రఫీ లేదా మామూలు యాంజియోగ్రామ్ పరీక్షలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రత్యక్షంగా స్టెంట్స్ తీరును తెలియజేస్తాయని వివరిస్తున్నారు. ఇంకా పరోక్షంగా తెలుసుకోవటానికైతే ట్రెడ్‌మిల్ పరీక్ష తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ఆహార జాగ్రత్తల విషయానికి వస్తే శాకాహారం తినటం మంచిదని సలహా ఇస్తున్నారు. కూరగాయలు ఎక్కువగా తినాలని.. దుంప కూరలు, వేపుళ్లు, మిఠాయిలు, మాంసం తినకూడదు. నూనె, ఉప్పు తగ్గించాలని అంటున్నారు. భోజనం కూడా తక్కువ పరిమాణంలో తినాలని.. కడుపు నిండా తినకుండా కాస్త ఖాళీ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
శరీరం పంపే హెచ్చరికలను గుర్తించారా? ఈ రోగాలు వస్తాయని బాడీ ముందే చెప్పేస్తుందట! అవేంటో తెలుసా?
రోజుకు ఎంత చక్కెర తినాలి? షుగర్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనట!