Telangana Style Natukodi Pulusu: నాటుకోడి పులుసు, ఈ పేరుకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. అలా తింటుంటే ఇలా నోట్లోకి జారుతుంది. ముఖ్యంగా వేడి వేడి గారెలను నాటుకోడి పులుసులో అద్దుకుని తింటే స్వర్గం దిగిరావాల్సిందే! అలా ఉంటుంది దీని టేస్ట్. మసాలా ఘుమఘుమలతో పొయ్యి మీద కుతకుత ఉడుకుతుంటూనే ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటుంది. ఇక పండగలప్పుడు చేయి తిరిగిన అమ్మమ్మలు, నానమ్మలు మసాలాలు దట్టించి చేస్తుంటే నోట్లో లాలాజలం పొంగాల్సిందే. మరి మీరు కూడా ఈ పండక్కి నాటుకోడిని తెచ్చి పులుసు పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఓసారి తెలంగాణ స్టైల్లో ఈ పులుసును ప్రిపేర్ చేసుకోండి. ఘాటు నషాళానికి ఎక్కిద్ది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చదివేయండి.
కావాల్సిన పదార్థాలు:
చికెన్ మారినేట్ కోసం:
- నాటుకోడి ముక్కలు - అర కేజీ
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
పులుసు కోసం:
- ఎండు మిర్చి - 20
- టమాట - 1
- వెల్లుల్లి రెబ్బలు - 10
- నూనె - ముప్పావు కప్పు
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - పావు టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- గరం మసాలా - 1 టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- ఓ బౌల్లోకి శుభ్రం చేసిన నాటుకోడి ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ 3 గంటల సేపు పక్కన పెట్టాలి.
- 3 గంటల తర్వాత ఓ గిన్నెలోకి బాగా కారం కలిగిన ఎండుమిర్చిని వేసి కొన్ని నీళ్లు పోసి ఓ అరగంట నాననివ్వాలి. ఈ లోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి.
- మిక్సీజార్‌లోకి టమాట ముక్కలు, నానబెట్టిన ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి.
- ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ బాగా కలిపి నూనె పైకి తేలేవరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత మారినేట్ చేసిన నాటుకోడి ముక్కలు వేసి మసాలాలు బాగా పట్టేలా కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి. ఈ క్వాంటిటీ మగ్గేందుకు సుమారు 15 నిమిషాల సమయం పడుతుంది.
- నూనె పైకి తేలిన తర్వాత ఉప్పు, కారాలు సరిచూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకుని మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత అరలీటర్ నీళ్లు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఆవిరి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మరోసారి కలిపి గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి మరో 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే పులుసు దగ్గరపడుతుంది.
- ఇలా పులుసు చిక్కగా మారినప్పుడు రుచి చూసి దింపేసుకుంటే సరి. ఘుమఘుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటే తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
అసలు సిసలైన ఆంధ్రా స్టైల్ "నాటుకోడి వేపుడు" - ఈ పద్ధతిలో చేశారంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!
తెలంగాణ స్టైల్ "వంకాయ కొత్తిమీర కారం" - కిర్రాక్ టేస్ట్‌తో అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్!