Hormone Imbalance Solution: ప్రస్తుతం చాలామంది హార్మోన్ల అసమతుల్యత సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, శక్తి కోల్పోవడం, మానసిక సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుతాయి. అయితే ఈ అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్లను తిరిగి సమతులం చేసుకోవాలంటే.. ఆహారమే కాకుండా మనం అనుసరించే జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ముఖ్యంగా ఉదయాన్నే మనం చేసే కొన్ని పనులు.. హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తాయని వివరిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిల్ పుల్లింగ్‌తో!
దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేయడం కొంతమందికి అలవాటు ఉంటుంది. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను పెంపొందించడంలోనూ సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతి వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటికి పోయి జీవక్రియల పనితీరు, పొట్ట ఆరోగ్యం మెరుగుపడతాయని వివరిస్తున్నారు. అదే విధంగా ఆయిల్ పుల్లింగ్ హార్మోన్ల స్థాయులను క్రమబద్ధీకరించడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెట్టచ్చని అంటున్నారు.
ఎండ పొడ తగలాల్సిందే!
మనలో చాలా మంది నిద్ర లేచీ లేవగానే మొబైల్ పట్టుకుంటుంటారు. దీనివల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయని అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఒత్తిడి దరిచేరితే.. ఇక ఆ రోజంతా చిరాగ్గానే గడపాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే హార్మోన్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఉదయాన్నే లేలేత ఎండలో ఓ అరగంట గడపమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీవ గడియారాన్ని ప్రేరేపించి.. భౌతిక, మానసిక, ప్రవర్తన పరంగా మార్పులు తీసుకొస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా చక్కటి జీవనశైలిని పాటిస్తామని.. తద్వారా నిద్ర సమయాల పైనా సానుకూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇలా జీవక్రియలన్నీ సక్రమంగా జరిగితే హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఇక ఇదే ఎండలో చిన్నపాటి వ్యాయామాలు చేయడం, నడక వంటివి చేస్తే మరీ మంచిదని చెబుతున్నారు. (ఈ రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కాఫీ వద్దు!
చాలా మందికి ఉదయం బ్రష్ చేసుకోగానే ఓ కప్పు కాఫీనో, టీనో తాగందే అడుగు ముందుకు పడదు. అయితే ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీని పరగడుపునే తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గ్రెలిన్, లెప్టిన్.. వంటి ఆకలి హార్మోన్లపై సానుకూల ప్రభావం పడుతుందని వివరిస్తున్నారు. ఫలితంగా రోజంతటికీ కావాల్సిన శక్తి శరీరానికి అందుతుందని అంటున్నారు. అలాగే నిద్ర సమయాల పైనా సానుకూల ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
చెప్పుల్లేకుండా నడిస్తే
చెప్పులు లేకుండా అడుగు బయట్టరు మనలో చాలా మంది. కానీ ఉదయాన్నే కాసేపు చెప్పుల్లేకుండా నడవడం వల్ల హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో Journal of Environmental and Public Healthలో ప్రచురితమైన The Effects of Grounding on the Human Body: A Systematic Review అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌పై సానుకూల ప్రభావం చూపి.. జీవ గడియారాన్ని ప్రేరేపిస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా హార్మోన్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయని అంటున్నారు. జీవక్రియల పనితీరు మెరుగుపడడమే కాకుండా అరికాళ్లలో మెదడుకు అనుసంధానమై ఉన్న నాడులపై ఒత్తిడి పడి.. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ వ్యాయామాలు చేస్తున్నారా?
మనం రోజంతా ఉత్సాహంగా ఉండడంలో ఉదయాన్నే చేసే వ్యాయామాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువులు ఎత్తడం, కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధం అవుతాయని అంటున్నారు. అలాగే స్క్వాట్స్, పుషప్స్, పులప్స్, లాంజెస్, క్రంచెస్ వంటి వర్కవుట్లను మధ్యమధ్యలో కాస్త విరామమిస్తూ సాధన చేయడం వల్ల.. ఇటు శారీరక ఫిట్‌నెస్, అటు హార్మోన్ల ఆరోగ్యాన్నీ మెరుగుపరచుకోవచ్చని వివరిస్తున్నారు.
ఈ చిట్కాలతో పాటు హార్మోన్ల సమతుల్యత కోసం డాక్టర్ సూచించిన మందులు, ఇతర సలహాలూ పాటించాలని చెబుతున్నారు. తద్వారా సత్వర ఫలితాన్ని పొందచ్చని.. వాటి మూలంగా ఎదురయ్యే అనారోగ్యాలనూ దూరం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో అందంగా కనిపించాలా? ఈ టిప్స్ పాటిస్తే సో బ్యూటీఫుల్!!