Ravichandran Ashwin MVP : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత చెన్నైలోని ఇంటి వద్దే ఉంటు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో తన పుస్తకం 'ఐ హేవ్ ద స్ట్రీట్స్: ఎ కుట్టీ క్రికెట్ స్టోరీ' (I Have the Streets: A Kutty Cricket Story)లోని విశేషాలను షేర్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన క్రికెట్ ప్రపంచంలో తానే సూపర్ స్టార్‌నని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
జట్టులో కొందరు ఆటగాళ్లనే గుర్తించడంపై కూడా అతడు స్పందించాడు. 'నిజానికి కొన్నేళ్ల నుంచి నేను మార్చాలి అనుకుంటున్న విషయం ఒకటి ఉంది. భారత క్రికెట్ గురించి మాట్లాడే సమయంలో చాలామంది ప్రతీసారి ఓ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. వారు కొన్నేళ్ల నుంచి రోహిత్, కోహ్లీ గురించే మాట్లాడుతుంటారు. నా చిన్నప్పుడు నేను కూడా సచిన్ గురించి ఎక్కువగా చెప్పేవాడిని. ఇతర సెలబ్రిటీలు, సూపర్ స్టార్ల గురించి కూడా అలాగే చేసేవాడిని. కానీ, ఇక్కడే నేను ప్రతి ఒక్కరికీ ఓ సందేశం చెప్పాలనుకొంటున్నాను. జట్టులో మిగిలిన ఆటగాళ్లంతా ఒకే విధంగా వ్యవహరించరు. కాబట్టే వీళ్లు గొప్ప ఆటగాళ్లయ్యారని చాలామంది భావిస్తుంటారు. అది తప్పు. ఎందుకంటే ఎవరి ఆట వారిదే. ఇది ఆట. నా వరకు, నా తల్లిదండ్రుల జీవితాల్లో నేను ఎంవీపీ (Most Important Person)ని. అది రోహిత్ లేదా విరాట్ మరింకెవరో బయటివారు కాదు. అలానే ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నమైంది. నా వరకు నేనే ఎప్పటికీ విలువైన ఆటగాడిని' అని అశ్విన్ పేర్కొన్నాడు.
అది రవిశాస్త్రికి నచ్చలేదు
2018లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ వార్డ్‌తో తాను మాస్టర్ క్లాస్ కార్యక్రమం చేయడం అప్పటి కోచ్ రవిశాస్త్రికి నచ్చలేదని అశ్విన్ చెప్పాడు. నాడు ఆ కార్యక్రమంలో క్యారమ్ బాల్ సహా వివిధ ట్రిక్స్‌పై చర్చించినట్లు పేర్కొన్నాడు. 'నాడు మాస్టర్ క్లాస్ చేసినందుకు రవిశాస్త్రి నా మీద కోప్పడ్డాడు. దానికి తనవైపు నుంచి కూడా ఓ పాయింట్ ఉంది. కానీ, నేను ఎప్పుడూ ట్రిక్స్ చెప్పే విషయంలో అభద్రతా భావానికి గురికాలేదు. ఆటలో రెండు విషయాలే ఉంటాయని అనుకుంటాను. మన టాలెంట్‌తో సత్తాచాటడం లేదా, ప్రత్యర్థి విసిరే సవాళ్లకు స్పందించడం. నాకు వచ్చింది చేయడాన్నే నమ్ముతాను' అని అశ్విన్ పేర్కొన్నాడు.
'అందుకే రిటైర్మెంట్ ప్రకటించా - ధోనీకి ఇతర కెప్టెన్లకు తేడా అదే'