Weight Loss Tips With Rice Eating : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వల్ల చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలంటే రైస్ తప్పనిసరిగా మానేయడం సహా ఇతరత్రా కఠినమైన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు కొందరు. ఆ డైట్లు పాటించటం సాధ్యం కాక చాలా మంది బరువు తగ్గడంపై వెనకడుగు వేస్తుంటారు. అయితే రైస్‌తో పాటు మనకు నచ్చిన ఆహారం తింటూ బరువు తగ్గవచ్చు. అవునండీ రైస్‌ను సరిగ్గా తీసుకుంటే అది మన బరువు తగ్గడంలో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. అదేలాగో తెలుసుకుందాం మరి.
అన్నంతో పాటు కూర సమానంగా
బరువు తగ్గాలంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు అన్నంతో సమానంగా కూరలు లేదా పప్పులు తినాలి. దీని వల్ల రైస్ తినటం తగ్గుతుంది. అదే విధంగా కూరలు, పప్పులలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అవి బరువు తగ్గడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా అన్నం తక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో అధిక కేలరీలు కూడా పెరగవు.
చిన్నప్లేట్లను వాడండి
మనం ఆహారం తీసుకునేటప్పుడు వాడే ప్లేట్లతోనూ మన అలవాట్లలో మార్పులు వస్తాయి. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు చిన్నప్లేట్లను వాడాలి. దానిలో రైస్, కర్రీ, పప్పులు ఉండేలా చూసుకుండి. ఇలా చేయడం వల్ల మన మనసుకు తక్కువ తింటున్న అనుభూతి కలగదు. శరీరానికి కావాల్సినంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.
సలాడ్లను తీసుకోండి
మీ రోజువారి ఆహారంలో తప్పకుండా సలాడ్లు ఉండేలా చూసుకోండి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటం సహా ఫైబర్, విటమిన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. అవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. వాటితో పాటు కూరగాయలలో ఉండే పీచు పదార్థాల వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాని వల్ల రైస్ తక్కువగా తీసుకుంటారు.