Tips to Avoid Usillu in Rainy Season:వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి ఎంతో హాయిగా అనిపించినా.. కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు. వర్షాలు కురవడం వల్ల నేలలో ఉండే వివిధ రకాల క్రిమి కీటకాలు, పురుగులు భూమిలో నుంచి బయటకు వస్తుంటాయి. ఇందులో కొన్ని నేలపైన తిరిగితే.. మరికొన్ని రాత్రి సమయంలో దీపాల చుట్టూ ఎగురుతుంటాయి. చినుకు పడితే చాలు.. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ.. లైట్‌ల చుట్టూ కొన్ని వందల సంఖ్యలో ఉసిళ్లు ఎగురుతుంటాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది లైట్‌లు ఆఫ్ చేస్తుంటారు. అయితే, ఈ ఉసిళ్లను తరిమికొట్టడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులంటున్నారు. ఈ టిప్స్ పాటించడం వల్ల ఈజీగా వాటిని తరిమికొట్టవచ్చని చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
నిమ్మకాయ, బేకింగ్ సోడా ద్రావణం : ఉసిళ్లు(Flying Termites) ఇంట్లోకి వస్తే.. వీటిని తరిమికొట్టడానికి నిమ్మకాయ, బేకింగ్ సోడా మిశ్రమం పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో నిమ్మకాయ రసం, బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లను కలిపి పురుగుల మీద స్ప్రే చేస్తే.. ఉసిళ్లు పారిపోతాయంటున్నారు.
నల్ల మిరియాల పొడి :నల్ల మిరియాల పొడి కూడా ఉసిళ్లను తరిమికొట్టడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఒక స్ప్రే బాటిల్లోనల్ల మిరియాల పొడి, నీళ్లు కలిపి వాటి మీద పిచికారీ చేయాలి. దీంతో ఆ ఘాటు వాసనకు పురుగులు పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 2014లో Entomology జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో నల్ల మిరియాల పొడి ఉసిళ్లను తరిమికొట్టడంలో సమర్థవంతంగా ఉందని కనుగొన్నారు.