Tips For Increase Memory Power : మనం జీవితంలో ఎదగడంలో, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో, కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడంలో మెదడు పనితీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ వాస్తవమేంటంటే వయసు పెరిగే కొద్దీ అందం తగ్గి మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. వయసు పైబడే కొద్దీ మతిమరుపు సమస్య కూడా పెరుగుతుంది.ఆలోచన మందగించి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒకే సారి రెండు మూడు పనులు చేయలేరు. మానసికంగా చురుగ్గా ఉండలేరు. కొందరికి మాటల మధ్యలో పదాలు కూడా దొరకవు. ఇవన్నీ సాధారణ మతిమరుపు లక్షణాలు. అయితే మీరు క్రమం తప్పకుండా చేసే కొన్ని పనులు వయసు పెరిగేకొద్దీ మీలో కలిగే మానసిక సమస్యలను తగ్గిస్తాయట. అవేంటంటే?
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే వ్యాయామం. రోజూ క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవారిలో హిప్పోకాంపస్ పరిమాణం పెరిగి మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసింది.
ఆరోగ్యకరమైన ఆహారం
మన శరీరంలో ఎలా ఉండాలా అనేది మనం ఏం తింటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వ్యక్తుల్లో అభిజ్ఞా క్షీణత 24 శాతం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనం నిరూపించింది. మీరు మీ జ్ఞాపకశక్తిని కాపాడుకోవాలనుకుంటే, మెదడు చురుగ్గా ఉండాలంటే మీ ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండాలి. శుద్ధి చేసిన చక్కెరకు వీలైనంత వరకూ దూరంగా ఉండాలి.
మెదడుకు పదును
మీ జ్ఞాపకశక్తి క్షీణించకుండా ఉండాలంటే ఉత్తమమైన మార్గాల్లో ఒకటి మెదడుకు పదును పెడుతుండటం. పజిల్స్ గేమ్స్ ఆడటం, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్చుకోవడం, నాడీ సంబంధాలను మెరుగుపరిచే ఆటలు ఆడటం వంటివి తరచు చేస్తుండాలి. ఇవి మానసికంగా వ్యాయామాలుగా పని చేస్తూ మెదడుకు సవాళ్ విసురుతూ చురుగ్గా మారుస్తాయి.