These Foods to Avoid for Healthy Bones :కూర్చోడానికి, నిల్చోడానికి, నడవడానికి, పరిగెత్తడానికి, ఇలా మన బాడీలో ఏ కదలిక జరగాలన్నా ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండటం చాలా అవసరం. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎముక సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కాగా ఇందుకు ప్రధానం కారణం మనం రోజూ తీసుకునే ఆహారమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బోన్స్ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మితిమీరిన ఉప్పు తీసుకోవడం :హార్వర్డ్ యూనివర్శిటీ ప్రకారం ఉప్పు (సోడియం) ఎక్కువగా తీసుకుంటే ఎముకలు బలహీనంగా మారతాయి. ఉప్పు ఎక్కువ తినడం వల్ల శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. సోడియం స్థాయులు పెరిగితే, కాల్షియం విసర్జన తీవ్రమవుతుంది. ఎముకలో కాల్షియం తక్కువగా ఉంటే అది పెళుసుగా మారి, త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు, గుండెపోటుకు దారి తీస్తుంది. అలాగే మితిమీరిన సాల్ట్ వాడకం మూత్రపిండాలను దెబ్బతీస్తుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి.
చక్కెర పానీయాలు :చక్కెర అధికంగా ఉండే ఆహారం కాల్షియం, విటమిన్ డి లోపానికి కారణమవుతుంది. NIH ప్రకారం, చక్కెర అధిక వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచడమే కాకుండా ఎముకల నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తుంది. అదే విధంగా ఎక్కువ చక్కెర శరీరంలో భాస్వరం శోషణను ప్రభావితం చేస్తుంది. ఎముకలను బలంగా ఉంచడంలో భాస్వరం చాలా సహాయపడతుంది. అందుకే బోన్స్ బలంగా ఉండాలంటే చక్కెర వినియోగం పరిమితికి మించకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తప్పకుండా తినండి!
కెఫిన్ పానీయాలు : అధిక కెఫిన్ వినియోగం వల్ల శరీరం నుంచి కాల్షియం బయటకు పోతుంది. ఆ కారణంగా ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఎముకలు బలంగా ఉండాలంటే ఎప్పుడూ పరిమిత పరిమాణంలో కెఫిన్ పానీయాలను తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
అధిక ప్రోటీన్ ఆహారాలు : బోన్స్ ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని ప్రొటీన్ ఆహారాలను పరిమితిని మించకుండా చూసుకోవడం. నిజానికి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జంతు మూలాల నుంచి ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల బాడీలో కాల్షియం లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ డైట్లో ప్రొటీన్ కంటెంట్ లిమిట్ దాటకుండా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
ఎసిడిక్ ఫుడ్స్ :సోడా లేదా ప్రాసెస్ ఆహారాలు వంటి ఎసిడిక్ ఫుడ్స్ ఎముకలలో ఖనిజాల నష్టానికి కారణం కావచ్చు. ఆహారంలో కనిపించే యాసిడ్-ఫార్మింగ్ ఫుడ్స్ బోలు ఎముకల వ్యాధికి కారణమయితే, ఆల్కలీన్-ఫార్మింగ్ ఫుడ్స్ లేదా సప్లిమెంట్స్ బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయని NIH పేర్కొంది.
మద్యం :మీ బోన్స్ బలంగా తయారుకావాలంటే మీరు చేయాల్సిన మరో పని ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం. ఎందుకంటే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడానికి శరీరానికి అవసరమయ్యే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే బోన్స్ ఆరోగ్యానికి తోడ్పడే కాల్షియం, విటమిన్ డి శోషణను నిరోధిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు.
ఈ వ్యాధి వస్తే ఎముకలు వట్టిగానే విరిగిపోతాయి - జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే!