Sleeping Hours By Age : సెలవు దొరికిందంటే చాలు చాలా మంది హాయిగా నిద్రపోవాలని మైండ్లో ఫిక్స్ అయిపోతుంటారు. అయితే మన ఆరోగ్య రహస్యం నిద్రతోనే ముడిపడి ఉందని చెబుతున్నారు డాక్టర్లు. అనారోగ్యంతో ఏ ఆస్పత్రికి వెళ్లినా ముందుగా డాక్టర్లు అడిగేది నిద్ర సరిగ్గా పడుతుందా అనే ప్రశ్ననే. దీనికి ప్రధాన కారణం మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికే డాక్టర్లు అలా అడుగుతారు. మామూలుగా రోజును మూడు భాగాలుగా విభజిస్తే అందులో ఒక వంతు నిద్రపోడానికే కేటాయించాలని సూచిస్తున్నారు వైద్యులు.
నిద్రలేమికి కారణం ఇదే
నిద్ర పట్టట్లేదంటే మీరు స్లీప్ డిజార్డర్స్‌తో బాధపడుతున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది నిద్రపోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. స్లీప్ అప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్-ఆర్ఎల్ఎస్, నార్కోలెప్సీ వంటి కారణాలతో చాలా మంది నిద్రకు దూరమవుతుంటారు. పగటిపూట నిద్రపోవడం, ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడం, నిద్రకు నిర్దిష్ట సమయం పాటించకపోవడం వంటి వాటివల్ల స్లీప్ డిజార్డర్ ప్రభావం మనపై పడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో నిద్ర సమస్యను తగ్గించేందుకు వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు కూడా ప్రత్యేక క్లినిక్‌లు వచ్చాయి.
వాస్తవానికి ప్రతి మనిషి తన జీవితకాలంలో వివిధ దశల్లో నిద్రకు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. పసిపిల్లాడి నుంచి వయోవృద్ధుడి వరకు ఒక్కో దశలో ఒక్కో సమయం చొప్పున నిద్రకు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. నిద్రకు నిర్దిష్టమైన సమయం కేటాయించకపోతే ప్రమాదకరమైన గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో మరి ఏయే వయసుల వారు రోజుకు ఎంత సమయం నిద్రపోవాలో అన్న అంశంపై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ సొసైటీ సంయుక్తంగా ఓ పరిశోధనను జరిపాయి. ఇందులో మంచి నిద్రకోసం కొన్ని సూచనలు చేశాయి. అవేంటంటే?
నవజాత శిశువులు (0-3 నెలలు)
మూడు నెలలలోపు వయసు ఉన్న నవజాత శిశువులు రోజుకు కనీసం 14 నుంచి 17 గంటలు నిద్రపోయేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలట. పుట్టిన వంద రోజుల వరకు బిడ్డ ఎదుగుదలకు నిద్ర ఎంతో ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.
శిశువులు (4-11 నెలలు)
నాలుగు నుంచి 11 నెలలు వయసు ఉండే పిల్లలు రోజుకు కనీసం 12 నుంచి 15 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే శరీర అవయవాలు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కనుక ఈ వయసు పిల్లలకు నిర్దేశించిన గంటలు నిద్రపోయేలా తల్లిదండ్రులు చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పసిపిల్లలు (1-2 సంవత్సరాలు)
ఏడాది నుంచి రెండేళ్ల వరకు పిల్లలు రోజుకు కనీసం 11 నుంచి 14 గంటలు నిద్రపోవాల్సి ఉటుంది. ఈ వయసులో పిల్లలు ఎక్కువగా ఆడుకుంటారు కనుక రోజులో సగం సమయం మెదడు విశ్రాంతి తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రీస్కూలర్లు (3-5 ఏళ్లు)
ఈ వయసు పిల్లలు నేర్చుకునే వయసులో ఉంటారు. కాబట్టి రోజులో కనీసం 10 నుంచి 13 గంటలు వీళ్లు నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్రలోనే మెదడు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ వయసులోని పిల్లలు ఎంత ఎక్కువగా నిద్రపోతే వారి మెదడు అంత చురుగ్గా పనిచేస్తుందట.