Suspense on SI, Constable, Computer Operator Death : కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురి అదృశ్యం ఘటన విషాదంగా మారిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ బుధవారం అదృశ్యం కాగా, అర్ధరాత్రి సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఎస్సై సాయికుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. చెరువు వద్ద ముగ్గురి వస్తువులు లభ్యం కావడంతో గజ ఈతగాళ్లతో సుమారు 13 గంటల పాటు గాలింపు చేపట్టగా మృతదేహాలు వెలుగు చూశాయి. ఎస్సై సాయికుమార్ బుధవారం ఉదయం కారులో వెళ్లినట్లు భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ తర్వాత కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో శ్రుతి, నిఖిల్‌లను కారులో ఎక్కించుకొని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతానికి చేరుకున్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
సంచలనంగా మారిన ముగ్గురి మృతి వెనక ఉన్న కారణాలపై మిస్టరీ వీడలేదు. ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారా? క్షణికావేశంలో జరిగిందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడేంత సమస్య ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు? ముగ్గురి మధ్య ఎలాంటి పరిచయాలు కొనసాగాయి? అవి వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ప్రమాదకరంగా పరిణమించాయా? చర్చించుకొని పరిష్కరించుకునేందుకే వారు చెరువు వద్దకు వెళ్లి ఉంటారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. చర్చలు ఫలించకపోవడంతోనే శ్రుతి చెరువులోకి దూకి ఉంటుందా? ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారా! అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముగ్గురి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు వారి కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
గంటల కొద్దీ ఫోన్లు : ముగ్గురూ వారం రోజుల నుంచి చాలా సార్లు, గంటల కొద్ది ఫోన్లలో మాట్లాడుకున్నట్లు నిర్ధారించారు. ఆ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాకు చెందిన ఎస్సై సాయికుమార్‌కు భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రుతికి వివాహం కాగా, అయిదేళ్ల కిందటే భర్తతో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ పరిచయమే ఇంతవరకు తెచ్చిందా? : భిక్కనూరు ఎస్సై సాయికుమార్ గతంలో బీబీపేటలో ఎస్‌హెచ్‌వోగా పని చేసినప్పుడు అక్కడ రిసెప్షనిస్టుగా పని చేస్తున్న కానిస్టేబుల్ శ్రుతితో పరిచయం ఏర్పడింది. బీబీపేటకే చెందిన నిఖిల్ కంప్యూటర్ల మరమ్మతులు చేసేవాడు. ఆ పని మీద ఠాణాకు వచ్చినప్పుడు సాయికుమార్, శ్రుతిలతో పరిచయం ఏర్పడింది. తర్వాత సాయికుమార్ భిక్కనూరుకు బదిలీ అయ్యారు. మొత్తానికి ఈ పరిచయమే వారి ప్రాణాల మీదకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, ఎస్సై మృతి - అసలేం జరిగింది?