Skin Peeling on Face Treatment:అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. కానీ, ఆధునిక జీవన శైలి, పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారి పగుళ్లు ఏర్పడతాయి. మరికొంతమందికి పగుళ్లు ఏర్పడి ఇన్ఫెక్షన్స్గా మారుతుంటాయి. ఇక వీటిని తగ్గించుకోవడానికి డాక్టర్లను సంప్రదించడం, క్రీములు వాడటం, సౌందర్య సాధనాలు ఉపయోగించడం, చిట్కాలు పాటించడం వంటివి చేస్తుంటారు. మరి మీ చర్మంపై కూడా పగుళ్లు ఏర్పడుతున్నాయా? అయితే డోంట్ వర్రీ. ఈ టిప్స్ పాటిస్తే మీ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అయితే అంతకుముందు ఈ చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి? అనే వివరాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు ఈ సమస్యలు: వాస్తవానికి వాతావరణ సమస్యలు, మందుల వల్ల ఈ సమస్య వస్తుందని.. పిల్లల్లో కొందరికి వారసత్వంగానే పొడి చర్మం వస్తుందని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్న ప్రియ అంటున్నారు. అలాగే జన్యులోపంతో పుట్టడం, శరీరంపై ఆయిల్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల కూడా ముడతలు రావడం, అరచేతులు మందంగా అయ్యి చర్మంపై పగుళ్లుగా ఏర్పడతాయని చెబుతున్నారు. తుమ్ములు, కళ్లలో దురద, ఆస్తమా, వారసత్వ వ్యాధులు ఉన్నప్పుడు కూడా చర్మంపై పగుళ్లు ఏర్పడుతాయని అంటున్నారు.
మధ్య వయసులో ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చిందంటే ముందుగా మీరు ఏదైనా మందులు వాడుతుంటే వాటిని చెక్ చేసుకోవాలని.. మొటిమలు, కొలెస్ట్రాల్ తగ్గడం లాంటి సమస్యలకు వాడే మందుల వల్ల కూడా చర్మంపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. కొందరి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటి వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే కొందరు వాకింగ్ చేయడానికి బయటకు వెళ్లినప్పుడు పొదలు, చెట్లు, అడవి లాంటి ప్రదేశాల్లో తిరుగుతారు. అలాంటి సమయంలోనూ ఈ చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మం పొడి బారి పగుళ్లు ఏర్పడి.. ఇన్ఫెక్షన్గా మారేంతలా ఉందంటే అది తప్పకుండా తీవ్రంగా పరిగణించాలని.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు.
చర్మ పగుళ్లు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు:
- స్నానానికి ముందు బాడీకి ఆయిల్ అప్లై చేసుకోవాలి.
- స్నానం చేసేటప్పుడు మాయిశ్చరైజ్ ఉన్న సబ్బులను ఉపయోగించాలి.
- నురుగు రాకుండా ఉండే లోషన్లు, సబ్బులు వాడాలి
- స్నానం చేసే సమయం 5-10 నిమిషాల మధ్య ఉండేలా చూసుకోవాలి
- స్నానం చేసే నీరు గోరువెచ్చగా ఉండాలి.
- స్నానం అవ్వగానే కొద్దిగా తేమ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- వీలైతే శరీరానికి పెట్రోలియం జెల్‌ను వాడడం మంచిది.