Health Care Tips for New Moms : గర్భం ధరించినప్పటి నుంచీ బిడ్డ పుట్టే దాకా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఇదే క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తల్లీ, బిడ్డా.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే, ప్రెగ్నెన్సీ తర్వాత బిడ్డకు పాలు ఇస్తుండడం వల్ల తల్లికి ఆకలేయడం కామన్. ఇదే సమయంలో కొందరికి తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తోంది. కానీ, ఇంట్లో పెద్దవాళ్లు తీపి ఎక్కువగా తినొద్దని.. అలా తింటే బిడ్డకు కఫం వస్తుందని అంటుంటారు. నిజంగా బాలింత స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకు కఫం వస్తుందా? అందులో నిజమెంత? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలింత స్వీట్స్ తింటే పిల్లలకు కఫం వస్తుందన్నది ఒక అపోహ మాత్రమే అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. పూర్వకాలంలో ఇంటి దగ్గరే ప్రసవాలు జరిగేవి. పెద్దవాళ్లే తల్లీ, బిడ్డ సంరక్షణ చూసుకునేవాళ్లు. దాంతో బిడ్డ ఆరోగ్య విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా, అది తల్లి వల్లే జరిగిందని భావించేవాళ్లు. ఈ క్రమంలోనే బాలింత తీపి పదార్థాలు తింటే పిల్లలకు కఫం వస్తుందన్న అపోహ కూడా అప్పటిదే అని సూచిస్తున్నారు. అంతేకానీ, దీనికి సంబంధించి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు అంటున్నారు.
పసిపిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంచడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. అందుకే పిల్లలు ఎదిగే క్రమంలో పాలు ఎక్కువగా తాగుతారు. పాలిస్తుండటం వల్ల తల్లికి ఆకలేయడం సర్వసాధారణం. అయితే, చాలా మంది పథ్యం పేరుతో చప్పిడి కూరలు, అన్నం పెడుతుంటారు. దాంతో కావాల్సిన పోషకాలు అందవు. కాబట్టి, బాలింతలు వారి బరువును బట్టి ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే డైట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అలాగే.. ఏం తిన్నా మితంగా, జీర్ణవ్యవస్థపై ప్రభావం పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
వీటికి దూరంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యానికి మేలు!
బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లికి ఎక్కువ కెలోరీలు అవసరమవుతాయి. అందుకే బాలింతలకు ఎక్కువగా తీపి తినాలనిపిస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ. అయితే, ఆయిల్లో వేయించిన, ఎక్కువ ప్రాసెసింగ్ చేసి తయారు చేసిన తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. దీనివల్ల బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని గుర్తుంచుకోవాలి. అందుకు బదులుగా ఇంట్లో తక్కువ చక్కెరతో చేసిన పాయసం, సేమ్యా.. బెల్లంతో చేసిన పల్లీపట్టీ, నువ్వుండలు, పూర్ణాలు లాంటివి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం తీపి తినాలనే మీ కోరిక తీరుతుందని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
బిడ్డ పుట్టగానే చేయాల్సిన పనులివే!.. ఆరోగ్యమైన శిశువు కోసం చిట్కాలు..
రీసెర్చ్: ప్రెగ్నెన్సీ టైమ్లో కాఫీ తాగితే - బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుందా ?