Maharashtra CM Suspense : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు సోమవారం కూడా తెరపడే అవకాశం కనిపించడం లేదు. సోమవారం జరగాల్సిన కీలక సమావేశం రద్దయిందని తెలుస్తోంది. మహారాష్ట్ర పరిస్థితులను పర్యవేక్షించడానికి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, ఆర్థిక మంత్రి సీతారామన్‌ను బీజేపీ కేంద్ర పరిశీలకులుగా నియమించింది. 132 మంది ఎమ్మెల్యేలతో వీరిద్దరు చర్చలు జరపనున్నారు. అనంతరం శాసనసభా పక్షనేత ఎంపికపై నిర్ణయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అయితే గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్‌నాథ్ శిందే సోమవారం అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేకు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ఫోన్ చేసి పరామర్శించినట్లు సమాచారం. అటు ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్ బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యేందుకు దిల్లీ వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పోర్టుపోలియోలపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు సమాచారం
మరోవైపు, డిసెంబరు 4న మహారాష్ట్ర కొత్త సీఎం పేరును మహాయుతి కూటమి ప్రకటించనుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఆరోజే బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఉదయం 10 గంటలకు జరగనందని వెల్లడించారు. డిసెంబర్ 5న ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతల సమక్షంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్ పేరు ఖరారు చేసినట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆదివారం ప్రకటించారు.
అయితే మహారాష్ట్రలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే పేర్కొన్నారు. మహాయుతి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయని చెప్పారు. అవన్నీ నిరాధారమైనవని అన్నారు. అనారోగ్యం కారణంగానే ఏక్‌నాథ్ శిందే విశ్రాంతి తీసుకుంటున్నారని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలను మహాయుతి కూటమి గెలుచుకుంది.