Side Effects of Eating Instant Noodles:ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మెజారిటీ జనం ఆర్డర్ చేసే ఐటమ్స్‌లో నూడుల్స్ ఉంటాయి. అంతేకాదు.. మార్కెట్ నుంచి ప్యాకెట్లు కొని తెచ్చుకొని ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకొని తింటూ ఉంటారు. మరి.. ఇవి తింటే ఏం జరుగుతుంది? ఆరోగ్యానికి ఎంత ప్రమాదం? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఇన్‌స్టంట్ నూడల్స్ తయారు చేయడానికి మోనోసోడియం గ్లుటామేట్ అనే పదార్ధాన్ని వాడుతారని.. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు మొదలు.. దీర్ఘకాలంలో ప్రమాదకర రోగాలు చుట్టు ముడతాయని అంటున్నారు.
గుండె జబ్బులు:ఇన్‌స్టంట్ నూడుల్స్ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో అధిక మొత్తంలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి హృదయనాళ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు.
2021లో "PLoS One" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఇన్‌స్టంట్ నూడుల్స్ తరచుగా తినే వారిలో గుండె జబ్బుల ప్రమాదం 1.1 రెట్లు ఎక్కువగా పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని పబ్లిక్ హెల్త్ స్కూల్ ఆఫ్ పెకింగ్ యూనివర్శిటీలో పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఈలీన్ ఎల్. యూన్ పాల్గొన్నారు. నూడుల్స్ గుండె ఆరోగ్యానికి మంచివి కాదని యూన్ చెప్పారు.
జీర్ణ సమస్యలు:ఇన్‌స్టంట్ నూడుల్స్ జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి. ఇది ఉబ్బరం, మలబద్ధకం, అతిసారానికి కారణమవుతాయి. ఎందుకంటే అందులో పీచు పదార్థాలు తక్కువ ఉండి.. సోడియం ఎక్కువగా ఉంటుంది.
హైబీపీ:నూడుల్స్‌లో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుందని.. ఇది రక్తపోటు పెరగడానికి కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే నీరు ఎక్కువగా నిలిచిపోవడంతో మూత్రపిండాలు సైతం దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.
పోషకాహార లోపం:రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసిన నూడుల్స్‌లో పోషకాలు ఉండవు. వీటిలో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉండదు. దీంతో పోషకాహార లోపం వేధిస్తుందని చెబుతున్నారు.
క్యాన్సర్: నూడుల్స్‌లో బిస్ ఫినాల్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణం అవుతాయని.. నూడుల్స్ ప్రతిరోజూ తింటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని అంటున్నారు.
మెటబాలిక్ సిండ్రోమ్:రోజూ నూడుల్స్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచే పరిస్థితుల సమూహం అని చెబుతున్నారు. 2019లో "Journal of the American College of Cardiology" లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తరచుగా ఇన్‌స్టెంట్ నూడుల్స్ తినే వ్యక్తులకు మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం 2.3 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు.
మధుమేహం:నూడుల్స్ తినడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. నూడుల్స్‌లో సాధారణంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయంటున్నారు.
మానసిక సమస్యలు: ఇన్‌స్టంట్ నూడుల్స్ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వివిధ సమస్యలు కలిగేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
అధిక బరువు:నేటి కాలంలో అధిక బరువు సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనికి కారణం ఈ ఇన్‌స్టంట్ ఫుడ్స్, ప్యాకేజింగ్ ఫుడ్స్ తినడమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కేలరీలు సైతం ఎక్కువే. దీంతో బరువు పెరుగుతారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే దీన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని సూచిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.