Famous Tea in Hyderabad : తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో దేశ, విదేశీ వంటకాలతో పాటు నాలుకకు జీవం పోసే వందలాది రకాల ‘టీ’లు మైమరపిస్తున్నాయి. మనకు తెలిసిన ఇరానీ చాయ్, గ్రీన్ టీ, అల్లం టీ, మసాలా టీలతో ఆగిపోకుండా దాదాపు 400 రకాల వేరు వేరు ‘టీ’లు హైదరాబాద్‌లోని వేర్వేరు కేఫ్, టీ షాపుల్లో లభిస్తున్నాయి. మల్లెల సువాసనల విహారం, మందారపూల మకరందం, గులాబీల గుభాళింపుతో నోట్లో ఊరిళ్లు వస్తున్నాయి. కేవలం రుచుల్లోనే కాదు, వాటి ధరల్లో కూడా అనేక వ్యత్యాసాలున్నాయి. మొదటగా రూ.5 నుంచి రూ.1000 వరకు ధర పలుకుతున్న తేనీరు నగరంలోని వివిధ ప్రదేశాలలో అందుబాటులో ఉంది.
టీ, బన్ మస్కాకు అభిమానులు : హైదరాబాద్‌వాసులకు, చాయ్‌కు ఉన్న అనుబంధం ఈ నాటిది కాదు. చాలా వందల ఏళ్ల క్రితం నుంచి ఇది కొనసాగుతుంది. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, పొగలు కక్కే ఇరానీ చాయ్, బన్ మస్కా కోసం పదుల కిలోమీటర్ల నుంచి కాళ్లకు చక్రాలు కట్టినట్లే చార్మినార్, లక్డీకాపూల్‌కు వెళ్తుంటారంటే చాయ్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలసరి ‘టీ’ వినియోగంలోనూ హైదరాబాదీలు అగ్ర స్థానంలో ఉన్నారని పలు రీసెర్చ్‌లు వెల్లడిస్తున్నాయి.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన రీసెర్చ్‌లో చాయ్ తాగే వారి గురించి నివేదికను వెల్లడించింది. ప్రస్తుతం ఇళ్లలో 89 శాతం మంది ‘టీ’ తాగుతుండగా, 8 శాతం మంది కాఫీ తాగుతున్నారన్న విషయాన్ని చెప్పింది. హైదరాబాదీల్లో తలసరి (ఒక్కొక్కరు) ‘టీ’ వినియోగం 302 గ్రాములుగా ఉందని వెల్లడించింది.
వందల ఔట్‌లెట్లు : చాయ్ తయారీతోనే వేలాది మంది టీ మాస్టర్స్ నగరంలో ఉపాధి పొందుతున్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో టీస్టాల్ అసోసియేషన్లను సైతం నెలకొల్పారు. కేవలం టీ మాస్టర్లకు రూ.20,000 వరకు వేతనాలిస్తున్నారంటే చాయ్ షాపులకు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ‘టీ’ అమ్మకానికి ఫ్రాంఛైజీలు కూడా చాలా ఉన్నాయి. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించి ఫ్రాంఛైజీ తీసుకుని చాలా మంది పట్టభద్రులు ‘టీ’ వ్యాపారంలోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ కూడా ఒకరు. 'మిస్టర్ టీ' అనే బ్రాండ్ నేమ్‌తో నవీన్ రెడ్డి అనే వ్యక్తి అనతి కాలంలో రూ.కోట్ల టర్నోవర్‌కు చేరారు. చాయ్ ప్రియులను ఆకర్షించేందుకు వేర్వేరు రకాల ‘టీ’లను కొత్తగా పరిచయం చేస్తూ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు పట్టభద్రులు.
ఎన్ని రకాలో : ప్రస్తుతం హైదరాబాద్‌లో గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ కప్పు ధర రూ.1000గా ఉంది. అయినా దీనికి మాత్రం గిరాకీ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఉలాంగ్, సిల్వర్ నీడిల్ వైట్‌టీ, జపనీస్ సెన్చా తరహా టీ, మొరాకన్ మింట్లు రూ.300 నుంచి లభ్యమవుతున్నాయి.
తందూరి మట్కా చాయ్, రాయల్ మచా, సంజీవని, ఫ్రెష్ బ్రీజ్, ఇండియన్ స్పైస్, గ్రీన్ చాయ్, ఇలాచీ చాయ్, బాదం టీ, కేసర్ స్పెషల్ టీ, పెప్పర్ టీ, పీచ్ ఉలాంగ్, కాశ్మీరీ చాయ్, బెల్లం చాయ్, లెమన్ టీ, జాఫ్రానీ చాయ్, యాపిల్ సినామన్, బ్లాక్ ఫ్రూట్ టీ, బెర్రీ ఫ్రూట్ టీ, సిల్వర్ నీడిల్స్, మొరాకన్ టీ, పెప్పర్ మింట్, తులసీ మింట్, వెర్జిన్ హెర్బ్, జెస్టీ జింజర్, స్పియర్‌మింట్, రెడ్‌జెన్, రష్యన్ కారవన్, సిల్వర్ నీడిల్ వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా వివిధ రకాల రుచులను నగరవాసులకు చేరువలో ఉంచుతున్నాయి.
బయట చేసే టీ స్టాల్ స్టైల్ "ఛాయ్" - ఈ కొలతలతో చేసుకున్నారంటే ఇరానీ టీ కంటే సూపర్ టేస్ట్!
తక్కువ ధరకే వస్తున్నాయని ఎక్కడపడితే అక్కడ ఆహార పదార్థాలు కొంటున్నారా? - మీరు రిస్క్‌లో పడినట్లే!