Side Effects of Drinking Alcohol With Soda: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ.. సోడా ప్రమాదకరమని కొందరికే తెలుసు. ఈ రెండిటినీ మిక్స్ చేసి తాగడం చాలా డేంజర్ అని మాత్రం పెద్దగా తెలియదు. మరి.. మందులో సోడా కలుపుకుని తాగితే ఏమవుతంది? వైద్య నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఎముకలు బలహీనం:ఆల్కాహాల్‌లో సోడా కలుపుకుని తాగడం ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోడాలో ఉండే పాస్పరిక్ యాసిడ్ శరీరంలో కాల్షియాన్ని తగ్గిస్తుంది. ఇది ఎముకలకు చాలా ప్రమాదకరం. ఒంట్లోని బోన్స్ బలహీనమైపోతాయి. చాలా కాలం సోడా తాగితే ఎముకల్లో పగుళ్లు కూడా ఏర్పడుతాయి. చిన్న దెబ్బ తగిలినా విరిగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బరువు పెరగడం:సోడాలో కేలరీలు ఉంటాయి. క్రమం తప్పకుండా ఆల్కహాల్లో సోడా కలుపుకోవడం వల్ల బరువు పెరుగుతారని అంటున్నారు. సోడాలోని అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని.. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
క్యాన్సర్:సోడాలోని కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా ఉంటాయని.. క్రమం తప్పకుండా ఆల్కహాల్లో సోడా కలుపుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో BMC పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మందులో సోడా కలుపుకుని తాగడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్ డాక్టర్ డానా బోస్ పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ఆల్కహాల్లో సోడా కలిపి తాగే వ్యక్తులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు.