reusing cooking oil can accelerate brain damage : ఒకసారి వంటకు వాడిన ఆయిల్.. మళ్లీ వంటల్లో ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. తాజాగా మరోసారి ఓ అధ్యయనం కీలక విషయాలు వెల్లడించింది. ఏకంగా బ్రెయిన్కే చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని రీసెర్చ్ చెబుతోంది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా న్యూరో డిజార్డర్ విస్తరిస్తోంది. మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్న రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. ఈ పరిస్థితికి గల కారణాలు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆహార పద్ధతులపైనా పరిశోధనలు నిర్వహించగా.. ఆయిల్‌కు, బ్రెయిన్ ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెల్లడైందని ప్రకటించారు.
ఇటీవల నిర్వహించిన "అమెరికన్ సొసైటీ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ" వార్షిక సమావేశంలో ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు. మళ్లీ మళ్లీ వినియోగించిన ఆయిల్.. మెదడు సంబంధిత రోగాల ముప్పును పెంచుతోందని పరిశీలకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎలుకలపై పరిశోధనలు నిర్వహించినట్టు తెలిపారు. కొన్ని ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా.. మరికొన్ని ఎలుకలకు మళ్లీ మళ్లీ వేడిచేసిన నూనెతో కూడిన ఆహారం ఇచ్చారు. ఈ రెండింటిని పోల్చి చూస్తే.. ఆయిల్ రీ-యూజ్ చేసిన ఫుడ్స్ తిన్న ఎలుకల్లో మెదడు అనారోగ్య ముప్పును ఎదుర్కొందని పరిశోధకులు తెలిపారు.
పలు నష్టాలు..
రీ-హీట్ చేసిన నూనెల వినియోగం వల్ల.. శారీరక సమతుల్యత దెబ్బ తింటుందని గుర్తించారు. కీలకమైన జీర్ణ వ్యవస్థ, కాలేయం, మెదడ మధ్య సమతుల్యతను ఈ ఆయిల్ దెబ్బతీస్తుందని ఈ రీసెర్చ్ సూచిస్తోంది. మొత్తంగా శారీరక విధులపైనా దీని ప్రభావం ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. మళ్లీ మళ్లీ వేడి చేసిన ఆయిల్ కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పలువురు ఆరోగ్య నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. ఇది ఫ్రీ రాడికల్స్ ముప్పు పెంచుతుందని.. దీనివల్ల దేహంలో వాపు ఏర్పడి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. ఇప్పుడు తాజా పరిశోధన కూడా వాటిని నిరూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరిశోధన ఎలుకల మీదకాబట్టి.. మరికొంత రీసెర్చ్ అవసరమని కొందరు సూచిస్తున్నారు. కానీ.. మానవ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎన్నో పరిశోధనలు తొలుత ఎలుకలపైనే నిర్వహించారు. మనిషి DNAతో ఎలుకల డీఎన్ఏకు చాలా దగ్గరి సంబంధం ఉండడమే ఇందుకు కారణం. కాబట్టి.. పర్సంటేజ్‌లో తేడాలు ఉండొచ్చేమోగానీ.. ఫలితాలు ఇంచుమించు అలాగే ఉంటాయని మరికొందరు అంటున్నారు.
వేడిచేసిన నూనెలను పదే పదే తినడం వల్ల.. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరగుతాయని, కాలేయం దెబ్బతింటుందని, దీర్ఘకాలిక రోగాలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి.. ముందుగానే మేల్కొని సరైన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించుకోవడానికి.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. చేపలు, గింజలు, పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.
Conclusion: