Protein Powder Side Effects:సిక్స్ ప్యాక్ బాడీ అంటే నేటి యువతకు చాలా ఇష్టం. చాలా మంది సిక్స్ ప్యాక్ కావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కండలు తిరిగిన దేహం కోసం ఉదయం, సాయంత్రం జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ, జిమ్‌లో కసరత్తులు, వ్యాయామాలు చేసినా.. సిక్స్ ప్యాక్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే త్వరగా సిక్స్ ప్యాక్ రావాలని ఆశపడే కొంతమంది ఇతర దారుల్లో ప్రయత్నిస్తున్నారు. అందులో ముఖ్యంగా చాలా మంది స్టెరాయిడ్లు, ఇతర నిషేధిత ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. మరి వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందో మీకు తెలుసా?
ఇలా ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్లు వాడితే కిడ్నీలపై భారం పడి ఆరోగ్యం గుల్లవుతుందని ప్రముఖ నెఫ్రాలజీ నిపుణులు డాక్టర్ శ్రీభూషణ్ రాజు హెచ్చరిస్తున్నారు. వీటిని కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని సూచిస్తున్నారు. లేకపోతే లైంగిక సామర్థ్యం కోల్పోవడం, మానసిక భ్రమలు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ జబ్బుల బారిన పడే ప్రమాదమూ ఉంటుందని ఆయన వివరిస్తున్నారు.
"స్టెరాయిడ్లు, వేప్రొటీన్ల వంటి పదార్థాలతో రక్తం వడబోసే క్రమంలో కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కొందరిలో కిడ్నీలకు హైపర్‌ఫిల్టరేషన్ గాయాలు అవుతుంటాయి. స్టెరాయిడ్స్‌తో కేవలం కిడ్నీల సమస్య మాత్రమే కాకుండా.. మధుమేహం, అధిక రక్తపోటు, ప్రొస్టేట్ క్యాన్సర్, వ్యాక్యులత లాంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది."
--డాక్టర్ శ్రీభూషణ్ రాజు, విభాగాధిపతి, నెఫ్రాలజీ విభాగం, నిమ్స్