Liquor Ban In Holy Towns In MP : మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాలున్న 17 పట్టణాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తామని సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం ఖర్గోన్లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మద్యం దుకాణాలను మూసివేయనున్న 17 పట్టణాల్లో ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఆరు నగర పాలికలు, ఆరు నగర పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించేందుకు తాము చేసిన సంకల్పం దిశగా ఈ నిర్ణయాన్ని తొలి అడుగుగా సీఎం మోహన్ యాదవ్ అభివర్ణించారు.
"ప్రధాన పుణ్య క్షేత్రాలున్న 17 పట్టణాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలను పూర్తిగా మూసేస్తాం. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రసక్తే లేదు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నీ మూతపడతాయి" అని మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించారు. నర్మదా నది పరివాహక ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతాయని సీఎం తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం జగదీశ్ దేవ్డా స్పందిస్తూ, తాము పూర్తిస్థాయి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని కొనియాడారు.
#WATCH | Maheshwar, Khargone | On the decision to ban liquor in 17 religious towns of the state, Madhya Pradesh Deputy Chief Minister Jagdish Devda says, " we are moving towards complete prohibition... this is a good decision by the chief minister." pic.twitter.com/EqrKY24qtM
— ANI (@ANI) January 24, 2025
మద్యం దుకాణాలు బంద్ కానున్న పట్టణాలివే!
మద్యం దుకాణాలు బంద్ కానున్న పట్టణాలు: దాతియా, పన్నా, మాండ్లా, ముల్తాయి, మంద్సౌర్, మైహర్ నగర్ పాలిక, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మాండ్లేశ్వర్, ఓర్ఛా, చిత్రకూట్, అమర్ కంటక్ నగర్ పరిషత్, సల్కాన్ పుర్, బర్మన్ కాలా, లింగా, కుండల్ పుర్, బందక్ పుర్, బర్మన్ ఖుర్ద్.
హర్షాతిరేకాలు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పుణ్యక్షేత్రాలు ఎంతో పవిత్రతను కలిగి ఉంటాయని, దానికి భంగం కలగకుండా మద్యం దుకాణాలను మూసేయడం మంచి నిర్ణయమని ప్రజానీకం కొనియాడుతున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల భావితరాలు మద్యానికి బానిస కాకుండా కాపాడొచ్చని పలువురు రాష్ట్ర ప్రజలు ఓ వార్తాసంస్థకు చెప్పారు. "యువత సన్మార్గంలో నడిచేందుకు ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయి. ఈ కాలంలో మద్యం తాగడం స్టేటస్ సింబల్‌లా మారింది. వాస్తవానికి మద్యం అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. బీజేపీ సర్కారు నిర్ణయం వల్ల పుణ్యక్షేత్రాలున్న ప్రాంతాల ప్రాధాన్యం మరింత పెరిగింది" అని ఉజ్జయిని నగరానికి చెందిన పలువురు స్థానికులు చెప్పుకొచ్చారు.
#WATCH | Madhya Pradesh CM Mohan Yadav-led state government approves ban on liquor in 17 holy cities of the state.
— ANI (@ANI) January 24, 2025
A resident of Ujjain says, " it will take youth towards the righteous path. nowadays, drinking has become a status symbol for the youth; this decision will help… pic.twitter.com/SJGTq6MtCP