RBI Ban On Loan Foreclosure Charges : వ్యక్తులకు, సూక్ష్మ, చిన్న సంస్థలకు(MSEs)లకు అందించే ఫ్లోటింగ్ రేటు రుణాలపై ముందస్తు చెల్లింపు (ఫోర్‌క్లోజర్) ఛార్జీలను నిషేధించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. అయితే వ్యాపారేతర ప్రయోజనాల కోసం తీసుకునే రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రతిపాదనను వివరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. మార్చి 21లోగా దీనిపై తమ అభిప్రాయం తెలపాలని బ్యాంక్‌లను కోరింది.
ఆర్‌బీఐ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం, ఇకపై ఎవరైనా వ్యక్తులు లేదా చిన్న, సూక్ష్మ సంస్థలు వ్యాపారేతర అవసరాల కోసం ఫ్లోటింగ్ రేట్ రుణాలు తీసుకుని, వారు ముందస్తు రుణ చెల్లింపులు చేస్తే, బ్యాంకులు లేదా రుణ సంస్థలు ఎలాంటి జరిమానాలు విధించకూడదు.
వ్యాపార రుణాలకు కూడా!
ఇదే విధంగా వ్యక్తులు లేదా ఎంఎస్‌ఈలు వ్యాపార ప్రయోజనాల కోసం తీసుకున్న ఫ్లోటింగ్ రేట్ రుణాలపై బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు ఫోర్‌క్లోజర్/ ముందస్తు చెల్లింపు ఛార్జీలను విధించలేవు. రూ.7.5 కోట్ల వరకు రుణ బకాయిలు ఉన్న ఎంఎస్‌ఈ రుణగ్రహీతలకు మాత్రమే ఈ జరిమానాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే టైర్-1, టైర్-2 ప్రైమరీ (అర్బన్) సహకార బ్యాంకులు, బేస్ లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు మాత్రం బిజినెస్ లోన్స్‌పై ప్రీక్లోజర్ ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇతర రుణాల పరిస్థితి ఏమిటి?
ఇతర రుణాల విషయానికి వస్తే, ముందస్తు చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపు ఛార్జీల వసూలు విషయంలో బోర్డ్ ఆమోదించిన విధానాన్నే బ్యాంకులు లేదా రుణ సంస్థలు అనుసరించాల్సి ఉంటుంది.
టర్మ్ లోన్స్ విషయంలో బకాయి ఉన్న రుణ మొత్తం, ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి ఆధారంగా ఇలాంటి ఛార్జీలు ఉండాలని ఆర్‌బీఐ ఆదేశించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణగ్రహీతలకు కనీస లాక్-ఇన్ వ్యవధి విధించకూడదని స్పష్టం చేసింది. ముందస్తు రుణ చెల్లింపులకు అనుమతించాలని సూచించింది. ఆర్‌బీఐ పలు సమీక్షల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఎంఎస్‌ఈ రుణాలపై విధిస్తున్న ముందస్తు చెల్లింపు ఛార్జీల్లోని అసమానతలు తొలగించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు పేర్కొంది.