Prevent Obesity In Children : పెద్దల్లో అధిక బరువు సమస్య రావడానికి వ్యక్తిగత వ్యవహార శైలే చాలా వరకు కారణం. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా ఉంటాయి. అయితే.. చిన్న పిల్లల్లో ఉబకాయం సమస్యకు తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ప్రధాన కారణంగా ఉంటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల.. తల్లిదండ్రులు ముందునుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆదర్శంగా ఉండండి :పిల్లలు తల్లిదండ్రులను చూసి చాలా అలవాట్లను నేర్చుకుంటారు. అందువల్ల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. వారికి ఆదర్శంగా నిలవాలి. ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీ, జంక్‌ఫుడ్ వంటి వాటిని బయటి నుంచి తీసుకురాకూడదు. ఇంట్లోనే వంటకాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తాజా ఆహార పదార్థాలను ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలగురించి తెలియజేయాలి. అలాగే పిల్లలకు సాయంత్రం స్నాక్స్‌గా తాజా పండ్లను అందించాలి.
వ్యాయామం :చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఆరోగ్య స్పృహ కలిగించడం తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. కాబట్టి, పిల్లలు ఇంటా బయట, అలాగే స్కూల్లో ఆటలు ఆడేలా ప్రోత్సహించండి. దీనివల్ల వారి శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. అలాగే వారికి స్విమ్మింగ్ నేర్పించండి. బాడీలో ఫ్యాట్ పెరగకుండా ఉండటానికి ఇది మంచి వ్యాయామమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఆటలు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉంటారని తెలియజేస్తున్నారు.
జంక్‌ఫుడ్ దూరం :చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడ్చినప్పుడు వారిని సముదాయించడానికి చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్ల వంటి వాటిని కొనిస్తుంటారు. అయితే, ఇలా రోజూ చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్‌ను పిల్లలు తినడం వల్ల వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, వారిని సముదాయించడానికి తాజా పండ్లతో చేసిన ఫ్రూట్ సలాడ్, జ్యూస్‌లను అందించాలని సూచిస్తున్నారు.
నిద్ర పోనివ్వండి :నేటి కాలంలో చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రుల లాగే అర్ధరాత్రి వరకూ మొబైల్ ఫోన్‌లు, టీవీలను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే, పిల్లలు దీర్ఘకాలికంగా నిద్రకు దూరం అవ్వడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉందట. కాబట్టి, రాత్రి తొందరగా పిల్లలు పడుకునేలా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.