Noodles Health Effects: సమయం లేదు, క్షణాల్లో స్నాక్స్ లేదా బ్రేక్ ఫాస్ట్ కావాలంటే చటుక్కున గుర్తొచ్చేది నూడుల్స్. చకచకా ప్యాకెట్ ఓపెన్ చేసి వేడినీళ్లలో వేసి చిటికెలో రెడీ చేసుకునే వంటకం. పైగా దీని రుచికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే మన డైలీ లైఫ్‌లో నూడుల్స్ వాడకం పెరిగిపోయింది. ఇవంటే పడిచచ్చే వాళ్లు చాలా మంది ఉన్నప్పటికీ నూడుల్స్ తినడం వెంటనే ఆపేయాలని చెబుతున్నారు నిపుణులు. నూడుల్స్‌లో ఉండే హై లెవల్ సోడియం, కెమికల్స్, అనారోగ్యకరమైన మిశ్రమాలు పలు సమస్యలకు దారి తీస్తాయి. ఫలితంగా హైబీపీ, గుండె జబ్బులు, మెటబాలిజంలో సమస్యలు వచ్చే ప్రమాదముంది.
పోషకాహార లోపం
నూడుల్స్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఇందులో అస్సలు దొరకవు. పైగా ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, అనారోగ్యాన్ని కలిగించే కొవ్వులు ఉండి శరీరం బరువు పెరిగేందుకు కారణమవుతుంటాయి. నూడుల్స్‌ను రెగ్యూలర్‌గా తీసుకునే వారిలో పోషకాహార లోపం కచ్చితంగా కనిపిస్తుంది.
బరువు పెరగడం
నూడుల్స్‌లో టేస్ట్ మరింతగా అనిపించేందుకు మోనోసోడియం గ్లుటామేట్ కలుపుతారు. ఇది వాడటం వల్ల తలనొప్పి, వికారం, బరువు పెరగడం, హైబీపీ వంటి సమస్యలుంటాయట. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైబీపీ ఉన్న వాళ్లకు డేంజర్
శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే వాటిల్లో సోడియం ఒకటి. అది ఈ న్యూడిల్స్‌లో ఎక్కువ మోతాదులో ఉంటుందట. అలా సోడియం ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు నూడుల్స్ తినడం తక్షణమే మానేయాలని చెబుతున్నారు.
మైదాతో తయారీ
నూడుల్స్‌ను తయారు చేసేందుకు వాడే పదార్థాలలో ప్రధానమైనది మైదా పిండి. అధికంగా ప్రాసెస్ చేసిన పిండినే దీనికి వినియోగిస్తారు. తృణధాన్యాలతో పోలిస్తే డైటరీ ఫైబర్, పోషకాలు మైదాలో చాలా తక్కువ. ఫలితంగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది మితిమీరితే షుగర్ సమస్యలు, ఇన్సులిన్ లెవల్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.