Natural Skin Cleansers :చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా ఉండటం అవసరం. అందుకే స్కిన్ కేర్ రోటీన్లో క్లీనింగ్‌కు ప్రాముఖ్యత చాలా ఉందని సౌందర్య నిపుణులు చెబుతుంటారు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సిందల్లా మీ స్కిన్ ఎలాంటిదో తెలుసుకోవాలి. చర్మం రకం తెలిసినప్పుడు మాత్రమే క్లీనింగ్ అనేది సరిగ్గా జరుగుతుంది. నిపుణులు, వైద్యులు చెబుతున్న దాని ప్రకారం, చాలా మంది మహిళలు, పురుషులకు వారి చర్మ రకాల గురించి అవగాహన ఉండదట. ఈ కారణంగానే చర్మ రక్షణ విషయంలో వారు మెరుగైన ఫలితాలను పొందలేకపోతున్నారట.
అందరి ఒకేలా ఉండదు!
ఒక్కో మనిషి ఒక్కోలా ఆలోచించినట్లుగా, ఒక్కో వ్యక్తి చర్మం ఒక్కో రకంగా ఉంటుంది. దాన్ని బట్టే మన స్కిన్ కేర్ రొటీన్‌ను ప్లాన్ చేసుకోవాలి. కొందరికి జిడ్డు గల చర్మం ఉంటుంది. మరికొందరికి పొడి చర్మం ఉంటుంది. ఇక రెండు కలిపి ఉన్నవారూ ఉంటారు. అయితే ఇలా వేరు వేరు రకాల చర్మాలు కలిగి ఉన్నందున క్లీనింగ్ కూడా వేరు వేరు పదార్థాలతో, ప్రత్యేకమైన పద్ధతుల్లో చేస్తే తప్ప మెరుగైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందలేమని నిపుణులు వివరిస్తున్నారు.
ఎలాంటి చర్మం గలవారు, ఎలాంటి క్లీనింగ్ పద్ధతులను ఉపయోగిస్తే మంచిదంటే?
జిడ్డు చర్మం గలవారు
Cleansers For Oily Skin :జిడ్డు చర్మం గలవారు చర్మాన్ని శుభ్రం చేసుకోవాలంటే ముల్తానీ మట్టి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ప్రాచీన కాలం నుంచి ఉపయెగంలో ఉన్న సహజమైన మట్టి. రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకుని, దాంట్లో చిటికెడు కర్పూరం పొడిని వేసి, కాసిన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో మీ చర్మాన్ని చక్కగా మర్దనా చేసుకుని పావుగంట తర్వాత శుభ్రం చేసుకుంటే స్కిన్ పూర్తిగా క్లీన్ అయిపోతుంది.
కాంబినేషన్ స్కిన్
Cleansers For Combination Skin :చర్మం కాస్త పొడిగా, కాస్త జిడ్డుగా ఉన్నట్లయితే దాన్ని కాంబినేషన్ స్కిన్ గా పిలుస్తారు. ఇలాంటి చర్మం ఉన్నవారు చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి మెత్తని బొప్పాయిని తీసుకుని దాంట్లో ఓట్ మీల్, పాలు కలిపి ముఖం, మెడ అంతా రుద్దుకోవాలి. ఇది చర్మంపై చాలా శక్తివంతమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. టాన్, నల్లటి మచ్చలు తొలగిపోయేందుకు కూడా ఈ ప్యాక్ చక్కగా సహాపడుతుంది.