Makhana Health Benefits in Telugu:వేల సంవత్సరాలుగా భారతీయ సంప్రదాయ ఆహారంలో భాగమైన మఖానాగా పిలుచుకునే తామర గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇందులోని ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్భోహైడ్రేట్లు, ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2017లో Journal of Food Scienceలో ప్రచురితమైన Nutritional and Phytochemical Analysis of Makhana (Euryale ferox Salisb.)" అనే అధ్యయనంలోనూ తేలింది. అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకున్నా.. మరికొందరు ఉడకబెట్టుకొని, వేయించుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా సరే.. తామర గింజలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మధుమేహంతో బాధపడేవారు వారానికోసారి మఖానాను తీసుకుంటే రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుందని వివరిస్తున్నారు. ఇంకా మఖానాలో మెరుగ్గా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచడమే కాకుండా ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్స్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు.
- మఖానాల్లో పుష్కలంగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు, ఆల్కలాయిడ్స్, సెపోనిన్స్, గాలిక్ యాసిడ్‌లు గుండెకు రక్షణగా నిలబడతాయని వివరిస్తున్నారు. ఇంకా మెగ్నీషియం రక్తప్రసరణను, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుందని.. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పుని తగ్గిస్తుందని అంటున్నారు.
- మఖానా గ్లూటెన్ ఫ్రీ కాకుండా ఇందులో తక్కువ సోడియం, కొలెస్ట్రాల్, అధిక మోతాదులో ప్రొటీన్ ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంకా వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయని వివరిస్తున్నారు. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతూ.. ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారిన పడకుండా చూస్తాయని చెబుతున్నారు.
- శరీరంలో వ్యర్థాలు, మలినాలు పేరుకోవడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతుంటాం. అయితే, వీటిని బయటకు పంపించాలంటే మఖానాను మీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలానే వీటిల్లో ఉండే థయామిన్ నరాల పనితీరు బాగుండేలా చేస్తుందని.. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుని దూరం చేస్తుందని చెబుతున్నారు.
- అధిక బరువు సమస్యతో బాధపడేవారు సైతం మఖానాను తీసుకోవడం ఉపశమనం పొందుతారని వివరిస్తున్నారు. ఇందులో క్యాలరీల శాతం తక్కువగా ఉండడమే కాకుండా ప్రొటీన్, ఫైబర్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయని చెబుతున్నారు. ఫలితంగా ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోని.. అధిక బరువునూ తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
- ఇందులోని క్యాల్షియం, మెగ్నీషియం.. ఎముకలు, దంతాల్ని దృఢంగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు. ఇంకా ఐరన్ రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతాయని వివరిస్తున్నారు.
- మఖానాలో సోడియం తక్కువగా ఉండి.. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయని వివరిస్తున్నారు. అందుకే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.
- మఖానా కేవలం ఆరోగ్యాన్నే కాకుండా.. చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, ముడతలు రాకుండా కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.