IS Curd Reduce Colon Cancer Risk:భోజనంలో ఎన్ని రకాలు ఉన్నా చివరికి కొద్దిగా పెరుగుతో తింటేనే తృప్తిగా ఫీలవుతారు చాలా మంది. కానీ, కొందరు అసలు పెరుగును ముట్టుకోరు. అయితే, రోజువారీ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల ప్రమాదకర క్యాన్సర్ ముప్పును కూడా అడ్డుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తరచూ పెరుగు తింటే జీర్ణకోశం మొత్తాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుందని, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా వారానికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్ ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కంటే కుడి వైపు క్యాన్సర్ తీవ్రమైందట. హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మాస్ జనరల్ బ్రిఘం పరిశోధకులు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
పేగుల్లోని బ్యాక్టీరియా సమతులంగా ఉండటానికి పెరుగులోని బ్యాక్టీరియా తోడ్పడటం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గటానికి వీలవుతోందని భావిస్తున్నారు. సుమారు 3 దశాబ్దాలుగా లక్షా 50వేల మందికి పైగా వ్యక్తుల నుంచి డేటాను పరిశోధకులు విశ్లేషించారు. పెరుగును క్రమం తప్పకుండా తినే వ్యక్తులలో పెరుగులోని బిఫిడోబాక్టీరియం వల్ల ప్రాక్సిమల్ కొలెరెక్టల్ క్యాన్సర్ (పెద్ద పేగు కుడి వైపున సంభవిస్తుంది) వచ్చే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు.
"పెరుగు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఇది పేగులు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది" అని ఈ అధ్యయనం సహ-సీనియర్ రచయిత, హార్వర్డ్ చాన్ స్కూల్‌లో ఎపిడెమియాలజీ విభాగంలో అసోసియేట్, బ్రిఘమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో పాథాలజీలో బోధకురాలు టొమోటకా ఉగై అన్నారు.