ICMR Guidelines For Women Who Do Not Exercise:వయసు పెరుగుతున్నకొద్దీ పురుషుల కంటే మహిళల్లో ఊబకాయం, పోషకాహార లోపం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత, గర్భం, మెనోపాజ్ ఇందుకు ప్రధాన కారణాలు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. కానీ.. చాలా మంది మహిళలు పలు కారణాల వల్ల వ్యాయామం చేయలేరు. అలాంటి వారికోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైట్ చార్ట్‌ను రూపొందించింది. ఈ డైట్ ద్వారా.. బరువు మాత్రమే కాదు.. పోషకాహార లోపాలను నివారించవచ్చని తెలిపింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
- వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్‌పై శ్రద్ధ పెట్టడం కీలకం అని ICMR తెలిపింది. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించింది. ఈ క్రమంలోనే తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలని.. అదే విధంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది.
- తక్కువ నూనె కలిగిన ఆహార పదార్థాలు, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలని చెబుతున్నారు.
- లీన్ ప్రోటీన్లు కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అందుకోసం స్కిన్‌లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. ఇవి అదనపు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు లేకుండా అవసరమైన పోషకాలు అందిస్తాయని తెలిపారు.
- ముఖ్యంగా కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలని... సరిపడా వాటర్, హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలని ICMR సూచించింది. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పింది.
- బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలంటే.. తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవాలని సూచించింది.
- ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలు జీర్ణక్రియకు సహాయపడతాయని, అలాగే ఎక్కువసేపు కడుపునిండిన భావనను కలిగిస్తాయని.. తద్వారా తక్కువ ఆహారం తీసుకోవడానికి సాయపడుతుందని చెబుతోంది.
- అధిక కేలరీలు, తక్కువ పోషకాలు కలిగిన స్నాక్స్‌కు బదులుగా తృణధాన్యాలు, గింజలు, సీజనల్ పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలని.. అలాగే ప్రొటీన్ల్లు అధికంగా లభించే పదార్థాలు తీసుకోవాలని అంటున్నారు.
- బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజల(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
- ఎముకలకు అవసరమైన కాల్షియం, విటమిన్ డి కోసం పాలు, పాల ఉత్పత్తులు మంచి మూలాలని ఐసీఎంఆర్ తెలిపింది. అందుకోసం తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు, మజ్జిగ క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించింది.
ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినడం.. సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.