How To Stop Rabies Disease :కుక్క ఎంత విశ్వాసం గల జంతువో.. పొరపాటున దాని కాటుకు గురైతే అంత ప్రమాదకరంగా కూడా పరిణమించే అవకాశం ఉంటుంది. టీకాలు వేయించని కుక్కలు కరిస్తే.. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. రేబిస్ వ్యాధి బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల రేబిస్ వ్యాధి రాకుండాఅడ్డుకోవచ్చని చెబుతున్నారు. మరి.. కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? రేబిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రేబిస్ వ్యాధి రావడానికి 'రేబిస్' అనే వైరస్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ కుక్క చొంగలో ఉంటుంది. టీకాలు వేయించిన కుక్కలకు ఇది సోకదు. ఈ వైరస్ ఉన్న కుక్కలు.. మనుషులను కరిచినా, శరీరం మీద గాయాలున్న చోట నాకినా, దాని చొంగ ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందట.
మీకు తెలుసా? - మీ మనసు ఎంత బాధపడితే - మీ సెకండ్ బ్రెయిన్ అంత ఏడుస్తుంది! - Gut Health Damage Foods
కుక్క కరిచినప్పుడు ఇలా చేయండి :
- కుక్క మనుషుల శరీరాన్ని పుండ్లు పగుళ్లు వంటివేవీ లేనిచోట నాకినప్పుడు పెద్దగా భయపడాల్సిన పనిలేదని నిపుణులంటున్నారు. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలని సూచిస్తున్నారు.
- ఒకవేళ కుక్క కరిస్తే.. వీలైనంత త్వరగా గాయాన్ని ధారగా పడుతున్ననీటి కింద పెట్టి 10-15 నిమిషాల సేపు సబ్బుతో శుభ్రంగా కడగాలి.
- అలాగే గాయాన్ని నేరుగా చేత్తో తాకకూడదు.
- గ్లౌజులు వేసుకుని కడుక్కుంటే మంచిది.
- తర్వాత గాయాన్ని పొడిగా తుడిచి, యాంటిసెప్టిక్ లోషన్లు రాసి వదిలెయ్యాలి. ఇలా చేసిన తర్వాత వైద్యుడిని సంప్రదించి.. యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలి.