Bad Cholesterol Reducing Foods:మన ఆరోగ్యానికి హాని చేసే అంశాల్లో చెడు కొలెస్ట్రాల్ కూడా ఒకటి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి గుండె సంబంధిత జబ్బులు పెరగడంతోపాటు స్ట్రోక్ వచ్చే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఆహారంలో, జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా అని బీఎమ్‌ఐ చెక్ చేసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. బీఎమ్‌ఐ 18-23 మధ్య ఉంటే బరువు సాధారణమని.. 23-25 ఉంటే అధికం, 25 దాటితే ఊబకాయమని వివరిస్తున్నారు. అలాగే శరీరంలో కొవ్వు శాతం తెలుసుకోవడానికీ ఇప్పుడు అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఇది మహిళల్లో 20-30 శాతం, పురుషుల్లో 10-20 శాతం మధ్య ఉండాలని పేర్కొన్నారు. ఇంకా నడుము చుట్టుకొలత ద్వారా కూడా అధిక బరువుని నిర్ధరించుకోవచ్చని అంటున్నారు. ఇందుకోసం నాభిపైన నాలుగు వేళ్లు పెట్టి ఆపైన నడుము చుట్టుకొలత చూడాలని తెలిపారు. ఆ సమయంలో చుట్టు కొలత అమ్మాయిల్లో 80 సెం.మీ, మగవాళ్లలో 90 సెం.మీ. దాటకూడదని చెబుతున్నారు. ఇలా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే అది చెడు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
చెడు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు అవయవాల్లో వాపుని తగ్గించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా రోజువారీ ఆహారంలో అవిసెలు, పొద్దు తిరుగుడు, నువ్వుల్లాంటి నూనె గింజల్ని సుమారు 30గ్రా. వరకూ తీసుకోవచ్చని వివరిస్తున్నారు. ముఖ్యంగా పీచు పదార్థాలు అధిక మోతాదులో తీసుకోవాలని అంటున్నారు. పాలిష్ చేసిన సూజీ రవ్వ, మైదా పిండిలాంటివి కాకుండా.. దంపుడు బియ్యం, రాగి, సజ్జ, జొన్నల్ని రవ్వగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. పొట్టు తీయని సెనగలు, అలసందలు, బొబ్బర్లు, ఎర్ర బొబ్బర్లు.. ఉడక బెట్టుకుని లేదంటే మొలకల రూపంలో తినాలని తెలిపారు.
ఇంకా రంగురంగుల కాయగూరల్ని కూరలుగా నేరుగా కాకుండా సలాడ్‌లుగానూ తీసుకోవాలని చెబుతున్నారు. తీపి, ఉప్పు పదార్థాలను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. వాడిన నూనే పదే పదే వాడే ప్రమాదం ఉంది కాబట్టి.. బయట హోటళ్లలో బోండా, వడ, పూరీ లాంటివి తినకుంటే మేలని సలహా ఇస్తున్నారు. ఇలా తినడం వల్ల వీటితో శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్ చేరుతాయని చెబుతున్నారు. తక్కువ క్యాలరీలూ, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండే జామ, దానిమ్మ, అల్ల నేరేడు, కర్బూజా, అల్‌బుకరా లాంటివి తీసుకోవాలని అంటున్నారు. ఇదే కాకుండా వీటిలో పీచుపదార్థాలూ ఎక్కువగానే ఉంటాయని వివరిస్తున్నారు.