What Happens if Change from Non Veg to Veg : ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలని, రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలనే విషయం అందరికీ తెలిసిందే. సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌లు ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అయితే.. చాలా మంది వెజ్, నాన్‌వెజ్ తింటుంటారు.కానీ.. కొద్దిమంది పూర్తిగా నాన్‌వెజ్ మానేసి శాఖాహారిగా మారిపోతుంటారు. మరి, ఇలా మాంసాహారం నుంచి వెజిటేరీయన్ గా మారితే ఏం జరుగుతుంది? పోషకాలు పొందడంలో సమస్య తలెత్తుతుందా? అనే సందేహం వస్తుంది. తాజాగా ఓ మహిళకు కూడా ఇలాంటి డౌట్ వచ్చింది. మరి, దానికి నిపుణులు ఏమని సమాధానం ఇచ్చారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మహిళ సమస్య ఇదే: "నాకు 28 ఏళ్లు. ఎత్తు 5.4. బరువు 62 కేజీలు. నేను మాంసాహారిని. ఇప్పట్నుంచీ నాన్‌వెజ్ మానేసి శాకాహారిగా మారాలనుకుంటున్నా. దీనివల్ల సమస్యలేమైనా వస్తాయా? పోషకాలన్నీ అందేలా ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి?" అని నిపుణుల సహాయం కోరారు. మరి దీనికి ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ జానకీ శ్రీనాథ్ ఏం చెప్పారో తెలుసుకుందాం..
మాంసాహారంలో ఉండే పోషకాలు వెజ్‌లో దొరకవని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ.. తగిన మోతాదులో శాఖాహారం తీసుకుంటే.. నాన్‌వెజ్ తినడం వల్ల వచ్చే చాలా సమస్యల్ని నివారించొచ్చని డాక్టర్ జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. మీరు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారు కాబట్టి.. మీ ఆహారపు అలవాట్లు మార్చుకునే ముందు కొన్ని విషయాలు గమనించుకోవాలని సూచిస్తున్నారు. అందులో ప్రొటీన్ ముఖ్యమైనదని.. రోజులో ఎంత శాతం మాంసకృత్తులు తింటున్నారన్నది ముందు తెలుసుకోవాలంటున్నారు. సాధారణంగా కేజీ బరువుకి 1 గ్రా ప్రొటీన్ అవసరమని.. దీని ఆధారంగా డైట్‌చార్ట్ ఉండాలని వివరిస్తున్నారు.
వెజిటేరియన్ డైట్‌లో కార్బ్సోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయని.. ఫలితంగా బరువు పెరిగే అవకాశాలెక్కువని డాక్టర్ చెబుతున్నారు. అలా బరువు పెరగకుండా చూసుకోవాలని.. అందుకోసం అన్నం, చపాతీ లాంటివి తక్కువగా తింటూ, పప్పులు ఎక్కువ తినాలని చెబుతున్నాపు. 100 గ్రా. పప్పు దినుసుల్లో 20 గ్రా. ప్రొటీన్ ఉంటుందని.. అలాగే పాలు, పాలసంబంధిత పదార్థాలు రోజుకి 300 గ్రా. తప్పనిసరిగా ఉండాలంటున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలూ సమపాళ్లలో అందుతాయని తెలుపుతున్నారు.
ఇవి కూడా: రోజులో ఒకపూట మినప్పప్పు, శనగపిండి, శనగలు, పెసలతో చేసిన ఆహారాన్ని తినమంటున్నారు. అలాగే గుగ్గిళ్లు, ఆవిరి కుడుము, పెసరట్టు, దోశ, డోక్లా లాంటివి కూడా తినాలని సూచిస్తున్నారు. కేవలం ఇవేకాకుండా సోయా నగెట్స్, సోయా పాలు, మీల్‌మేకర్, టోఫు లాంటివి తిన్నా తగిన మోతాదులో మాంసకృత్తులు అందుతాయని సూచిస్తున్నారు. అలాగే ఆకుకూరలు, నూనెగింజలు, నువ్వులు, చియా, వాల్‌నట్స్‌నూ తీసుకోమంటున్నారు. అయితే బి12, హిమోగ్లోబిన్ స్థాయుల్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని.. ఒక్కసారిగా శాకాహారిగా మారడం వల్ల ఇవి తగ్గే అవకాశాలు ఎక్కువ కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ జానకీ శ్రీనాథ్ సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో జలుబు, దగ్గు, అజీర్తి - ఈ ఫుడ్స్ తో చెక్ పెట్టొచ్చట!
మహిళల్లో ఈ విటమిన్లు తప్పక ఉండాలట- అవేంటి? ఎందులో లభిస్తాయో మీకు తెలుసా?