HMPV Virus Children:HMPV.. ప్రస్తుతం చైనాలో వచ్చిన కొత్త వైరస్ గురించే చర్చ నడుస్తోంది. హ్యూమన్ మెటాన్యుమోవైరస్ గురించి పెద్దగా ఆందోళన, భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చో ప్రముఖ పిడియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కల్యాణి వివరిస్తున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.
"ఈ వైరస్ తొలి వారంలో ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా, వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, పిల్లికూతల వంటి లక్షణాలు ఉంటే వారిని.. శిశువులకు, చిన్న పిల్లలకు దూరంగా (కనీసం ఆరు అడుగులు) ఉంచాలి. మీరైనా, పిల్లలనైనా వేరే గదిలో విడిగా ఉంచితే ఇంకా మంచిది. ఇంకా చేతులను శుభ్రంగా కడుక్కోకుండా శిశువులను ముట్టుకోకూడదు. రోజుకు అరగంట సేపు (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో) పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. ఫలితంగా విటమిన్ డి ఉత్పత్తై రోగనిరోధకశక్తి పెరుగుతుంది. పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాలూ, పోషకాహారం ఇవ్వాలి. శిశువులకు విధిగా తల్లిపాలు ఇవ్వాలి. పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. అయితే శ్వాస వేగంగా తీసుకుంటున్నా, జ్వరం తీవ్రంగా ఉన్నా, పాలు తాగకపోతున్నా, డొక్కలెగరేస్తున్నా, ఆయాస పడుతున్నా, మరీ ఎక్కువగా దగ్గుతున్నా, స్తబ్ధుగా ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సొంత వైద్యం చేసుకోకూడదు. ముఖ్యంగా స్టిరాయిడ్లు, యాంటీబయాటిక్ మందులు గానీ వాడకూడదు. ఈ మధ్య కాలంలో చాలామంది డాక్టర్లు ఫోన్‌లో ఆడియో లేదా వీడియో కాల్స్‌తోనూ వైద్య సేవలను అందిస్తున్నారు. ఒకవేళ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించాలి. ఫలితంగా చల్లగాలికి పిల్లలను తిప్పకుండా ఇంట్లోనే ఉండి, వైద్య సలహాలు పొందొచ్చు."
--డాక్టర్ శ్రీనివాస్ కల్యాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్
కొవిడ్-19తో పోలిక!
అయితే, హెచ్‌ఎంపీవీ కొన్ని విషయాల్లో కొవిడ్-19 కారక సార్స్-కొవీ-2తో పోలి ఉంటుందని డాక్టర్ శ్రీనివాస్ కల్యాణి చెబుతున్నారు. ఇవి రెండూ అన్ని వయసుల వారిలోనూ శ్వాసకోశ జబ్బులకు దారితీసేవేనని వివరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తగ్గినవారికి ఎక్కువ ముప్పు పొంచి ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఇంకా రెండింటి లక్షణాలూ దాదాపు ఒకేలా ఉంటున్నాయని అంటున్నారు. కొవిడ్‌లో మాదిరిగానే జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, ఆయాసం వంటివీ ఇందులోనూ కనిపిస్తున్నాయని తెలిపారు. ఇవి రెండూ దగ్గు, తుమ్ములు, సన్నిహితంగా ఉండటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఇంకా వైరస్ వ్యాపించిన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, నోరు, కళ్లను అంటుకున్నా సోకుతుందని చెబుతున్నారు.