Health Benefits Of Vamu :మన వంటింట్లో ఎప్పుడూ ఉన్నా కేవలం కొన్ని వంటకాల్లో మాత్రమే ఉపయోగించేది వాము. దీన్నే కొందరు 'ఓమ' అని కూడా పిలుస్తారు. ఈ గింజలు వంటలకు మంచి సువాసన అందించడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తాయని మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. వాళ్లే కాదు వాము తినడం వల్ల అరుగుదల సమస్యలు, గ్యాస్, యాసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతుంటారు.
నియాసిన్, థియామిన్, ఉప్పు, ఫాస్ఫరస్, పొటాషియం, క్యాల్షియం లాంటి విటమిన్లు, ఖనిజాలు వాములో పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్లు, ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండే వామును నేరుగా తీన్నా వాము నీళ్లని తాగినా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందట. ఇన్ని సుగుణాలున్న వామును మనం రోజూవారీ ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే జీర్ణ సమస్యలు నయం కావడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలిగుతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
వాము గింజల్లో డైటరీ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచడంలో మెరుగైన పాత్ర పోషిస్తాయి. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయులు గుండెపోటు వంటి జబ్బులతో సహా వివిధ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వీటి నుంచి తప్పించుకునేందుకు వాము గింజలు మీకు ఎంతగానో సహాయపడతాయి.
జలుబు, దగ్గులకు చికిత్స
ముక్కు, గొంతుల్లో పేరుకుపోయిన, అడ్డుకుంటున్న శ్లేష్మాన్ని బయటకు పంపి నాసిక మార్గాలను క్లియర్ చేసే సామర్థ్యం వాముకు ఉంది. ఇది ఊపిరితిత్తులకు గాలి ప్రసరణను సులభతరం చేస్తుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు వాము తినడం లేదా వాము నీటిని తాగడం వల్ల వెంటనే మంచి ఉపశమనం దొరుకుతుంది.
రక్తపోటు నియంత్రణ
వాము గింజల్లో ఉండే 'థైమోల్' రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఇవి క్యాల్షియం ఛానెల్ బ్లాకింగ్ చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి గుండె కణాలు, రక్తనాళాల్లోకి క్యాల్షియం చేరకుండా అడ్డుకుని రక్తపోటును తగ్గిస్తాయి.
బ్యాక్టీరియా, ఫంగస్
వాము గింజల్లో లభించే 'థైమెల్', 'కార్వాక్రోల్' అనే పదార్థాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని హానికరమైన బ్యాక్టీరియాలు, ఫంగస్ లాంటి వాటికి దూరంగా ఉంచుకోవచ్చు.