Health Benefits Of Kiwi :మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ ఎంతోమంది జబ్బుల బారినపడుతుంటారు. అందుకు ముఖ్య కారణం.. ఈ కాలంలో వాతావరణం మారటమే అని చెప్పుకోవచ్చు. అలాగే వాటర్ కలుషితం కావడం, దోమల బెడద పెరగడం కూడా వానాకాలంలో జబ్బుల విజృంభణకు కారణమవుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్లూ, డెంగీ(Dengue), టైఫాయిడ్, న్యుమోనియా, మలేరియా, వాంతులు, విరేచనాలు, కామెర్ల వంటివెన్నో విజృంభిస్తుంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. డెంగీ. ఇది ఎటాక్ అయ్యిందంటే హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది.
ఆ టైమ్‌లో దీనికి తగిన చికిత్స తీసుకోకుంటే.. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, అలాంటి సమయంలో తగిన మందులు వాడుతూ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆ టైమ్‌లో కివీ ఫ్రూట్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. ఇంతకీ, కివీ పండు డెంగీ నివారణకు ఎలా తోడ్పడుతుంది? అది తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కివీ పండ్లలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ పండ్లను తరచుగా తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. వీటిలో అధికంగా ఉండే సి-విటమిన్‌తో పాటు ఇతర పోషకాలు జలుబు, ఉబ్బసం లాంటి శ్వాస ఇబ్బందులను నివారించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. అలాగే.. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు, జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయంటున్నారు.
వర్షాకాలంలో ఈ డ్రింక్స్ తాగితే - రోగనిరోధక శక్తి పెరగడం పక్కా! పైగా ఈ ప్రయోజనాలు గ్యారెంటీ!
ముఖ్యంగా కివీలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు రక్తంలో ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి, డెంగీ బారిన పడినవారు ఈ ఫ్రూట్ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.