Lumpy Skin Disease Vaccine: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి (ఎల్‌ఎస్‌డీ) టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకు ఈ టీకాను అందిస్తారు. బయోలంపివ్యాక్సిన్ అనే పేరుతో రూపొందించిన ఈ టీకా మనదేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. ఇప్పటికే దీనికి సీడీఎస్‌సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుంచి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పనిచేస్తుందని వివరించింది. ఇంకా, దీన్ని ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌సీఈ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐవీఆర్‌ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు పేర్కొంది. హిస్సార్‌లోని ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌సీఈ అందించిన ఎల్‌ఎస్‌డీ వైరస్/ రాంచీ/ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్‌తో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు బయోవెట్ సంస్థ తెలిపింది.
ఏటా 50 కోట్ల డోసుల తయారీ
మరోవైపు బయోలంపివ్యాక్సిన్ రూపొందించడంపై భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ టీకాకు సీడీఎస్‌సీఓ లైసెన్సు లభించడం, మనదేశంలో పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. బయోలంపివ్యాక్సిన్‌ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్ల వెల్లడించారు. బయోవెట్‌కు కర్ణాటకలోని మల్లూర్‌లో ఉన్న యూనిట్లో ఏటా 50 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని తెలిపారు.
ఈ లింపీ స్కిన్ వ్యాధి వల్ల మనదేశంలో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు చనిపోయాయి. ఇంకొన్ని లక్షల పాడి పశువులు పాలు రాకుండా వట్టిపోయాయి. అయితే, ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్‌ఎస్‌డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని వివరించాయి.
ఏమిటీ వ్యాధి?
పశువుల్లో కాప్రిపాక్స్‌వైరస్ కారణంగా లంపీ స్కిన్ వ్యాధి సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గోట్‌పాక్స్, షీప్‌పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్ అని.. ఇది సోకిన పశువులు జ్వరం బారినపడడమే కాకుండా వాటి చర్మంపై గడ్డలు ఏర్పడుతాయన్నారు. వాటిపై రక్తాన్ని పీల్చే దోమలు, పురుగులు వాలి కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావం అవుతుందని తెలిపారు. ఫలితంగా కొన్ని రోజుల్లోనే బరువు కోల్పోవడంతోపాటు పాల దిగుబడి తగ్గిపోతుందని చెప్పారు. దీంతో పాటు శ్వాస, లాలాజల స్రావాలు కూడా మరింత ఎక్కువై పశువుల మరణానికి దారితీస్తుందని వివరించారు.
రోజు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా? - ఈ అందం వెనుక పెద్ద ప్రమాదమే ఉంది!
40 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నా పర్లేదు - ఆరోగ్యకరమైన పిల్లల్ని ఇలా కనండి!