Health Benefits of Bajra :ఆరోగ్యకరమైన చిరుధాన్యాలలో సజ్జలు కూడా ఒకటి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఇ, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సజ్జలతో చేసిన ఆహారం తినడం వల్ల మనకు ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుందట. అయితే, సజ్జలను తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ? బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఎలా తీసుకోవచ్చు ? అనే విషయాలను ప్రముఖ డైటీషియన్ 'డాక్టర్ శ్రీలత' వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
గ్లూటెన్-ఫ్రీ :
సాధారణంగా చాలా రకాల ధాన్యాల్లో గ్లూటెన్ ఉంటుంది. కానీ, సజ్జల్లో గ్లూటెన్ ఉండదు. చాలా మందికి గ్లూటెన్ ఉండే ఆహారాల వల్ల ఎలాంటి హాని ఉండదుకానీ.. కొంతమంది శరీరానికి సరిపడదు. వీరికి గ్లూటెన్ అలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. సజ్జల్లో గ్లూటెన్ ఉండదు. కాబట్టి దీనిని అందరూ తినవచ్చు.
బరువు పెరగకుండా అదుపులో :
నీటిలో లేదా పొట్టలోని ద్రవాల్లో త్వరగా కరగని పీచు పదార్థం సజ్జలలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. అలాగే పీచు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. దీనివల్ల బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోవచ్చు.
పిండి జల్లించకూడదట!
చాలా మంది సజ్జలను మర ఆడించిన తర్వాత.. జల్లెడ పట్టి పిండిని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇలా చేయకూడదు. సజ్జ పిండిని జల్లించి ఉపయోగించడం ద్వారా కొన్ని రకాల విటమిన్లు, మినరల్స్, వంటి పోషకాలను కోల్పోతాము. కాబట్టి పిండి జల్లించకుండానే వాడుకోవాలి.
మొలకల రూపంలోనూ..
వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించేవారు సజ్జలను మొలకల రూపంలోనూ తీసుకోవచ్చు. మొలకవచ్చిన సజ్జల్లో కొన్ని ఉడికించిన కూరగాయలు, బఠానీలు కలిపి తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల పోషకాలు రెట్టింపవుతాయి. ఈ మొలకలను ఇడ్లీ పిండిలో, దోశ పైన కూడా వేసుకుని తినొచ్చు.