Periods Pain Relief Tips: పీరియడ్స్ వచ్చినప్పుడు పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవడం కామన్. ఇందులో కడుపునొప్పి, నడుంనొప్పి ముఖ్యంగా చిరాకు, ఒత్తిడి, ఆందోళన ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి కొందరు మాత్రలు వేసుకుంటారు. కానీ ట్యాబ్లెట్లతో పని లేకుండానే పీరియడ్స్ సమయంలోనూ సౌకర్యంగా, ఉల్లాసంగా ఉండొచ్చని అంటున్నారు. ఇందుకోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలని ఆరోగ్య నిపుణులు వివరించారు.
అయితే, పీరియడ్స్ సమయంలో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం క్యాల్షియం విరివిగా లభించే పాలు, పాల పదార్థాలు, పాలకూర.. వంటివి మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని వెల్లడించారు. ఈ విషయం 2018లో Journal of Women's Healthలో ప్రచురితమైన "Calcium Intake and Menstrual Cramp Severity in Young Women"(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అనే అధ్యయనంలో వెల్లడైంది. ఇవి నొప్పిని తగ్గించడంతో పాటు మూడ్ స్వింగ్స్, ఆహారం ఎక్కువగా తినాలన్న కోరికను అదుపు చేయడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు. అలాగే సాయంత్రం స్నాక్స్ సమయంలో కూడా నూనె పదార్థాలు కాకుండా.. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా లభించే పండ్లు, నట్స్, కాయగూరలు తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడుతుందన్నారు. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై మనసును ఉత్తేజపరుస్తాయని వివరించారు.
అయితే, ఈ సమయంలో చాలామందికి ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పిని తట్టుకోలేక కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. కానీ వీటిని తరచూగా వాడితే ఆరోగ్యానికే నష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మాత్రలకు బదులు హీట్ ప్యాక్ లేదా వేడి నీళ్ల బాటిల్‌తో కాపితే నొప్పిని దూరం చేసుకోవచ్చని అంటున్నారు. కాస్త గోరువెచ్చటి నీటితో స్నానం చేసినా మనసుకు ప్రశాంతంగా అనిపించి హాయిగా నిద్రపడుతుందని వివరించారు.
మసాజ్ చేసుకోవచ్చు
పీరియడ్స్‌లో వచ్చే కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, ఇతర ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి అత్యవసర నూనెలు ఎంతగానో తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం నొప్పి వచ్చే చోట లావెండర్, రోజ్‌మేరీ, పెప్పర్‌మెంట్ ఇలా ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్‌తో కాస్త మసాజ్ చేస్తే త్వరిత ఉపశమనం కలుగుతుందని వివరించారు.
గోరువెచ్చటి నీళ్లతో
ఇంకా ఈ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలని.. వీలైతే గోరువెచ్చటి నీళ్లు తాగితే మరింత మంచిదని అంటున్నారు. ఇలా తాగడం వల్ల శరీరంలో నొప్పి ఉన్న కండరాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి ఉపశమనం పొందే వీలుంటుందని వివరించారు. ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీరా దోస వంటి పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
పీరియడ్స్ సమయంలో ఏ పని చేయాలన్నా శరీరం సహకరించక.. అలసట, చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇంకా ఎప్పుడెప్పుడు విశ్రాంతి తీసుకుందామా అని ఎదురుచూస్తుంటారు. కానీ ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ తదితర సమస్యల నుంచి విముక్తి పొందచ్చని వివరించారు. అయితే ఈ సమయంలో మీరు ఎంచుకునే వ్యాయామాలు పొత్తి కడుపు, నడుముపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి
హెయిర్ లాస్‌తో ఇబ్బంది పడుతున్నారా? దీంతో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుందట!