Hair Care Benefits of Bitter Gourd:ప్రస్తుతం చాలా మందిలో జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, జుట్టు పొడిబారడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు ఉన్నాయి. ఇందుకు కారణాలు అనేకం. అయితే.. ఈ సమస్యలకు పరిష్కారం కాకర రసం అని నిపుణులు అంటున్నారు. కాకర రసం జుట్టుకు పట్టించడం వల్ల సమస్యలు తగ్గిపోతాయని.. కుదుళ్లు దృఢంగా, కురులు ఒత్తుగా తయారవుతాయంటున్నారు. మరి.. కాకర రసాన్ని ఎలా అప్లై చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
చుండ్రు తగ్గించడానికి:పోషకాహారం తీసుకోకపోవడం, కాలుష్యం.. తదితర కారణాల వల్ల చాలా మందిలో చుండ్రు సమస్య ఎదురవుతుంది. దీనికోసం కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని కాకర రసంలో కలిపి మాడుకు అప్త్లె చేసుకోవాలి. కొంతసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.
జుట్టు రాలే సమస్య:అరకప్పు కాకర రసాన్ని తీసుకొని, అందులో చెంచా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించాలి. మాడుకు కూడా రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 40నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు అప్త్లె చేస్తే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుందని అంటున్నారు.
2013లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీకల్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాకరకాయలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడంలో సహాయపడతాయని.. ఇవి జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని బీజింగ్‌లోని చైనా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ యాంగ్ షాన్ పాల్గొన్నారు.