How to Make Pepper Rasam in Winter : తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక చలికాలం అంటే చాలా మంది వేడి వేడి చారు, రసానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే మీకోసం మిరియాల రసం తీసుకొచ్చాం.
ఈ చారు కేవలం అద్భుతమైన రుచికోసమే కాకుండా.. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు సమస్యల నుంచి కాపాడుకోవడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ చారు చేయడానికి ఎంతో సమయం పట్టదు. కేవలం 5 నిమిషాల్లోనే సిద్ధమైపోతుంది. ఈ రెసిపీకి కాంబినేషన్‌గా బంగాళాదుంప ఫ్రై మొదలు.. ఏ వేపుడు అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మరి.. ఇంతటి రుచికరమైన మిరియాల చారును ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10 - 12
- నూనె - 1 టేబుల్ స్పూన్
- ఆవాలు - 1 టేబుల్ స్పూన్
- పసుపు - పావు టేబుల్ స్పూన్
- ఎండు మిర్చి - 3
- టమాట - 1(పెద్దది)
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజు (నానబెట్టి రసం సిద్ధం చేసుకోవాలి)
- కరివేపాకు - 3 రెమ్మలు
- కొత్తిమీర – చిన్న కట్ట
- ఇంగువ - 2 చిటికెలు
తయారీ విధానం..
- ముందుగా నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టి దాని నుంచి రసాన్ని తీసి అందులో 600ml నీళ్లు కలిపి పక్కన ఉంచాలి.
- ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
- ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి.
- అనంతరం రుచికి సరిపడా ఉప్పు వేసి టమాట ముక్కలు మెత్తగా ఉడికి గుజ్జులా మారేవరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత ముందే సిద్ధం చేసుకున్న చింతపండు రసం పోసి బాగా కలపాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల మిశ్రమం వేసి మరోసారి బాగా కలపాలి.
- ఇప్పుడు కాడలతో సహా కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసి కలుపుకోవాలి.
- మీడియం ఫ్లేమ్ మీద చారు ఓ పొంగు వచ్చే వరకు ఉంచి, స్టవ్ ఆఫ్ చేసి దించుకుంటే.. ఎంతో రుచికరమైన మిరియాల చారు రెడీ.
- ఈ మిరియాల చారు అన్నంతోపాటు ఇడ్లీ, వడ వంటి టిఫెన్లోనూ సూపర్‌గా ఉంటుంది.
- జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు.. వడకట్టి ఛాయ్ మాదిరిగా తాగితే ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది.
ఈ టిప్స్ కంపల్సరీ:
- మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని రోట్లో దంచితేనే చారు రుచి వస్తుంది. మిక్సీలో వేస్తే ఫ్లేవర్ మిస్ అవుతుంది.
- ఇక.. కొత్తిమీర, కరివేపాకును కాడలతో సహా చారులో వేసేయాలి.
- అన్నిటికన్నా ముఖ్యమైనది.. చారు ఒక్క పొంగుతోనే దింపేసుకోవాలి. బాగా మరిగితే చారులోని సువాసన తగ్గిపోతుంది.
సూపర్ టేస్టీ : 10 నిమిషాల్లో టమాటా మిరియాల రసం - ఇలా ప్రిపేర్ చేస్తే ఒట్టి రసం కూడా తాగేస్తారు!
వింటర్ స్పెషల్ - ఘుమఘుమలాడే "కళ్యాణ రసం" - ఇలా చేస్తే తినడమే కాదు డైరెక్ట్‌గా తాగేస్తారు కూడా!