Habits To Change Your Life : జీవించడానికి పని చేయడం ఎంత ముఖ్యమో పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడమూ అంతే ముఖ్యం. సంతోషంగా ఉండాలంటే పనికీ, వ్యక్తిగత సమయానికి సమతుల్యత అనేది చాలా అవసరం. మీరు కెరీర్లో బాగా ఎదిగేందుకు కష్టపడుతున్నారు మంచిదే. కానీ, మీకోసం మీరు కాస్త సమయం కేటాయించలేనప్పుడు మీరు సంపాదించేదాన్ని మీరు ఆస్వాదించలేనప్పుడు అదంతా శూన్యమే అనిపిస్తుంది. అందుకే ఆఫీసు తర్వాత మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు తప్పకుండా చేయాల్సినవి, అలవాటుగా మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మీరు ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన జీవితాన్ని గడిపేందుకు సహాయపడతాయట. అవేంటో చూద్దాం.
డిస్‌కనెక్ట్
దాదాపు ఎనిమిది నుంచి పది గంటల పాటు మీరు ఆఫీస్ పనిలో భాగంగా బిజీబిజీగా గడిపేసి ఉంటారు. అందుకే ఆఫీస్ అయ్యాక మీరు మొదటగా చేయాల్సింది ఆఫీసుకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్‌టాప్ ఆఫ్ చేసేయడం లేదా అక్కడి నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫోన్లు, నోటిఫికేషన్ల నుంచి డిస్‌కనెక్ట్ అవ్వాలి. మీకోసం మీరు గడిపే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.
శారీరక శ్రమ
మీరు ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రం శారీరక శ్రమను అలవాటుగా మార్చుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్, యోగా, జిమ్, డాన్స్ లాంటి ఎలాంటిదైనా సరే చేయవచ్చు. శారీరకంగా కాస్త శ్రమ కలిగించే పనిని రోజులో కనీసం అరగంట పాటైనా చేసి ఆనందంగా గడపడం మీ పర్సనల్ లైఫ్‌కు చాలా మంచిది.
ఆసక్తి ఉన్న వాటిపై సమయం కేటాయించడం
కొందరికి పాటలు పాడటం అంటే ఇష్టం. ఇంకొందరికి మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకొందరికి పెయింటింగ్, మరికొందరికి తోటపని అలా మీ అభిరుచికి తగినది మీకు బాగా ఆసక్తి కలిగి ఉన్న పనులు ఉంటాయి. వాటిని ఎంచుకుని ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపైనా చేయండి. ఇలా మీకు సంతోషాన్ని, సంతృప్తినిచ్చే పనిని మీరు చేయడం వల్ల మీలో తెలియని ఉత్సాహం మాత్రమే కాదు చాలా రిలీఫ్‌గా ఫీలవుతారు.