Ginger Side Effects of Consuming Too Much :మనం ఛాయ్ దగ్గర నుంచి అన్ని రకాల కూరల్లో అల్లం ఎక్కువగా వాడుతుంటాం. జలుబు, దగ్గు, నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉపశమనం పొందేందుకు కూడా దీనిని ఉపయోగిస్తుంటాం. అయితే.. "అతి ఏదైనా అనర్థమే" అన్నట్టుగా.. అల్లం ఎక్కువగా తీసుకున్నా కూడా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణ సంబంధిత సమస్యలు :మన బాడీలోని జీర్ణవ్యవస్థను అల్లం ఉత్తేజపరుస్తుంది. అందుకే.. చాలా మంది ఆరోగ్య రీత్యా దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే.. ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదంటున్నారు నిపుణులు. పరగడుపున అల్లం తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గుండెలో మంట, డయేరియా వంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే అల్లాన్ని అధికంగా తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
2016లో 'న్యూట్రిషన్ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అల్లం అధికంగా తీసుకున్న వ్యక్తులు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను ఎక్కువగా అనుభవించారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో షాంఘై జియాటాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ షు-హువాన్ లి పాల్గొన్నారు. అల్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది :అల్లం మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, దీన్ని అతిగా తీసుకుంటే హైపోగ్లైసీమియాకు కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితికి దారితీస్తుందంటున్నారు. హైపోగ్లైసీమియా వల్ల కింది సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- వణుకు
- చెమటలు పట్టడం
- తలనొప్పి
- ఆకలి లేదా వికారం
- క్రమరహిత లేదా వేగవంతమైన హృదయ స్పందన
- అలసట
- చిరాకు లేదా ఆందోళన
కాబట్టి.. డయాబెటిస్ మందులు వాడుతున్నవారు అల్లం ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.